సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 18, 2020 , 04:37:07

ఓరుగల్లులో సినీ జోష్‌..

 ఓరుగల్లులో సినీ జోష్‌..
  • -హైదరాబాద్‌ తర్వాత వేగంగా విస్తరిస్తున్న వరంగల్‌
  • -షూటింగ్‌లకు అనుకూలంగా ఇక్కడి చారిత్రక ప్రదేశాలు
  • -రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి
  • -హన్మకొండలో ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభ
  • -హాజరైన హీరో మహేశ్‌బాబు, చిత్రయూనిట్‌
  • -పాల్గొన్న ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు, మేయర్‌, కుడా చైర్మన్‌, ప్రముఖులు

ఓరుగల్లులో తారలు సందడి చేశారు.. ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబు, హీరోయిన్లు రష్మికమందన్న, విజయశాంతితోపాటు దర్శక, నిర్మాతల రాకతో జోష్‌ నెలకొంది. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు..’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో శుక్రవారం రాత్రి హన్మకొండలోని జేఎన్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి చారిత్రక ప్రదేశాలు చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని, సినీ ప్రముఖులు చిత్రపరిశ్రమను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. హీరో కృష్ణ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందిందని, ఇలాంటి విజయాలు మరెన్నో జరుపుకోవాలని చిత్రయూనిట్‌ను ఆయన కోరారు. హీరో మహేష్‌బాబు మాట్లాడుతూ ఈ చిత్రం సక్సెస్‌ కోసం చిత్ర యూనిట్‌ ఎంతగానో కష్టపడ్డారని, వారందరి కృషి ఫలితమే విజయోత్సవ సభ అన్నారు. 

వరంగల్‌స్పోర్ట్స్‌, జనవరి17: హీరో మహేశ్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌ కొల్లకొడుతూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈవిజయోత్సవ కార్యక్రమాన్ని  శుక్రవారం చిత్ర యూనిట్‌ నగరంలోని జేఎన్‌ఎస్‌ ప్రాంగణంలో నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మహేశ్‌బాబు అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా సందడిగా మారింది.

వరంగల్‌లో చిత్ర పరిశ్రమకు కృషి

-మంత్రి దయాకర్‌రావు
ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ హీరో కృష్ణ కుటుంబంతో తనకు చాలా ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని, హీరో మహేశ్‌బాబు ఫోన్‌ చేసి మీ వరంగల్‌కు సక్సెస్‌ మీట్‌కు వస్తున్నాని చెప్పగానే చాలా ఆనందం వేసిందని అన్నారు. వరంగల్‌కు గొప్ప చరిత్ర ఉందని ఇలాంటి నగరంలో చిత్రం సక్సెస్‌మీట్‌ జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ నెలకొల్పేందుకు వరంగల్‌ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని, సినీ ప్రముఖులు ముందుకు వస్తే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి చిత్ర సరిశ్రమ వరంగల్‌లో నెలకొల్పేందుకు కృషి చేస్తానని అన్నారు.

అభిమానుల ఆశీర్వాదమే  ఈ ఘన విజయం

-హీరో మహేశ్‌బాబు
ఈ చిత్రం సక్సెస్‌లో చిత్ర యూనిట్‌ అంతా ఎంతగానో కష్టపడింది. అందరి కృషి ఫలితమే ఈ సక్సెస్‌ మీట్‌. అభిమానుల కోసం నేను నిత్యం సరికొత్తగా దగ్గర కావాలని అనుకుంటున్నా. అందుకు దర్శకులు మంచి కథలతో సినిమా లు చేయిస్తున్నారు. చాలా కాలం తర్వాత బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ నా కెరీర్‌లో ఈ చిత్రం ద్వారా వచ్చింది. 30ఏళ్ల తర్వాత విజయ శాంతి లాంటి సీనియర్‌ ఆర్టిస్టుతో మళ్లీ కలిసి పనిచేశా. ఈ చిత్రంలో ఆవిడ పాత్ర చిత్ర విజయానికి కీలకంగా నిలిచింది.

బ్రోచర్‌ విడుదల..

కార్యక్రమంలో భాగంగా హీరో మహేశ్‌బాబు చేతుల మీదుగా నగర పోలీస్‌ కమీషనర్‌ రవీందర్‌ మహిళల భద్రతపై ‘డయల్‌ 100’ పై అవగాహన బ్రోచర్‌ను విడుదల చేయించారు. ఈకార్యక్రమంలో సినీ ఆర్టిస్టు రాజేందప్రసాద్‌, నగర మేయర్‌ గుండాప్రకాశ్‌, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, ధర్మారెడ్డి, రాజయ్య, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, నిర్మాతలు దిల్‌ రాజు, అనిల్‌ సుంకర, ఫైట్‌ మాస్టర్స్‌ రాం లక్ష్మణ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తరలివచ్చిన అభిమానం..

సరిలేరు నీకెవ్వరూ సక్సెస్‌ మీట్‌కు వేదికగా నిలిచిన హన్మకొండ జేఎన్‌ఎస్‌ ప్రాంగణానికి నగరంలోని సినీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించిన శ్రేయ మీడియా నిర్వాహకులు అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన హీరో, హీరోయిన్‌, ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులను చూస్తూ అభిమానులు కేరింతలు కొడుతూ పాటలకు తమదైన శైలిలో నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ తెగ ఎంజాయ్‌చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఇది నా పోరుగల్లు: విజయశాంతి

ఓరుగల్లు ఇదే నా పోరుగల్లు. ఈ జిల్లాకు చెందిన బిడ్డగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినీరంగంలో అభిమానులు నా నటనకు మంచి గుర్తింపు ఇచ్చారు. అలాగే రాజకీయంలో ప్రజాసేవ కోసం ప్రజల్లోకి వచ్చినప్పుడూ అదేస్థాయిలో అభిమానులు ఆదరించడంతో పాటు అండగా ఉన్నారు.

అభిమానులకు కృతజ్ఞతలు: హీరోయిన్‌ రష్మిక మందన్నా
ఈచిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన మహేశ్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు. ఈ చిత్రం ద్వారా చాలా మంది సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది.

మహేశ్‌బాబు ముందే చెప్పారు:

-చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి
మహేశ్‌బాబు కథ విన్న సమయంలోనే ఈచిత్రం మనం తప్పకుండా చేస్తున్నామని అలాగే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తప్పకుండా కొడుతున్నామని ముందుగానే చెప్పారు. అనుకున్నట్లుగానే వారం రోజుల్లోనే ఈచిత్రం 100కోట్ల కలెక్షన్స్‌తో దూసుకెళ్తూ సక్సెస్‌మీట్‌లు జరుపుకుంటుంది. ఈచిత్రం విజయంలో నటీనటులందరూ ఎంతగానో కష్టపడ్డారు. ఈవిజయంలో అందరి కృషి ఉంది.

ఓరుగల్లులో తారల తళుకులు

సుబేదారి, జనవరి 17: నగరానికి సినీ గ్లామర్‌ వచ్చింది. సరిలేరునీకెవ్వరు సినిమా సక్సెస్‌ మీట్‌ వరంగల్‌లో నిర్వహించడంతో ఓరుగల్లు ప్రజలు ముఖ్యంగా యూత్‌ ఎంజాయ్‌ చేశారు. హీరో మహేశ్‌బాబు డైలాగులు, హీరోయిన్‌ రష్మిక అందచందాలకు అభిమానులు ఫిదా అయ్యారు. నగరంలో మొట్టమొదటిసారిగా స్టార్‌ హీరో నటించిన సినిమా విజయోత్సవసభను జరుపుకోవడం అనేది ప్రత్యేకత సంతరించుకున్నది. మహేశ్‌బాబు నటించిన సరిలేరునీకెవ్వరు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టడంతో వరంగల్‌లో విజయోవత్సవ సభను చిత్రయూనిట్‌ శుక్రవారం నిర్వహించింది. దీంతో హన్మకొండ జేఎన్‌ఎస్‌లో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. స్టేజీ, ప్రాంగణమంతా కలర్‌ఫుల్‌ లైటింగ్‌, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. యాంకర్‌ శ్రీముఖి తనదైన ైస్ట్టెల్‌లో కార్యక్రమాన్ని ఆసాంతం రక్తికట్టించింది. సత్యం డాన్స్‌మాస్టర్‌ గ్రూప్‌ చేసిన నృత్యాలు అభిమానులకు ఆకట్టుకున్నాయి.logo