ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Jan 18, 2020 , 04:35:27

పుడమి పులకించేలా..

పుడమి పులకించేలా..
  • -కొత్తకొండలో వీరభద్రస్వామికి త్రిశూల స్నానం
  • -ఆకట్టుకున్న వీరశైవుల విన్యాసాలు
  • -స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే వొడితెల
  • -ఆలయానికి తరలివచ్చిన అశేష భక్తజనం
  • -నేడు అగ్నిగుండాల ప్రవేశం

భీమదేవరపల్లి: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం  త్రిశూలస్నాన ఘట్టం కనుల పండుగగా సాగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకురాగా.. జెడ్పీటీసీ వంగ రవి, ఆలయ ఈవో సులోచన, ప్రధాన అర్చకులు తాటికొండ వీరభద్రయ్య కలషాలను ఎత్తుకున్నారు.  మంగళవాయిద్యాల  నడుమ  ఏపీలోని కర్నూలు జిల్లా రాయదుర్గానికి చెందిన వీరశైవులు వీరభద్ర పల్లెరం చేశారు. వీరశైవులు విన్యాసాలు చేస్తుండగా.. ఉత్సవమూర్తులను, త్రిశూల కలషాలను పవిత్ర కోనేరుకు తీసుకెళ్లి స్నాపనం గావించారు.  అనంతరం భక్తులు పెద్ద ఎత్తున కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించారు.  మొగిళిపాలెం రాంబాబు, తాటికొండ వినయ్‌, రాజయ్య, రమేశ్‌, సిబ్బంది జగన్‌, హంసారెడ్డి, సందీప్‌, భక్తులు పాల్గొన్నారు.

స్వామివారి ఏకాంత సేవ

స్వామివారి వసంతోత్సవం గరువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నీలలోహిత గౌరిపూజ, అష్ట బైరవార్చన, ఏకాంత పల్లకీసేవ నిర్వహించారు. 

ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట

-మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
భీమదేవరపల్లి: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  వేములవాడ, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ఐనవోలు, కొత్తకొండ తదితర ఆలయాలు ప్రత్యేక తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. వీరభద్రస్వామి ఆశీస్సులు  ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ఈవో సులోచన శేషవస్ర్తాలు సమర్పించి స్వామివారి మెమోంటోను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌, జెడ్పీటీసీ వంగ రవి, ఎంపీపీలు జక్కుల అనిత, మేకల స్వప్న, సర్పంచ్‌ దూడల ప్రమీల, ఎంపీటీసీ యాటపోలు రాజమణి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

వృక్షప్రసాదం భేష్‌

 వీరభద్రస్వామి పుణ్యక్షేత్రంలో వృక్షప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయమని   కడియం శ్రీహరి అన్నారు. శనివారం భక్తులకు వృక్షప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రతి పుణ్యక్షేత్రంలో వృక్షప్రసాదం పంపిణీ చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  ఏటా కొత్తకొండ బ్రహ్మోత్సవాల్లో  వృక్షప్రసాదం పంపిణీ చేస్తున్న  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి ఆయనకు శాలువ కప్పి సన్మానించారు.logo