శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 17, 2020 , 02:33:49

19న పల్స్‌పోలియో..

19న పల్స్‌పోలియో..చిన్నారులకు చుక్కలు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే..
 జిల్లాలో 94 వేల మందికిపైగా  ఐదేళ్లలోపు చిన్నారులు..
మొత్తం 606 పల్స్‌పోలియో కేంద్రాల ఏర్పాటు..
సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ పీజేపాటిల్‌

అర్బన్‌ కలెక్టరేట్‌, జనవరి 16: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ తెలిపారు. నిండు జీవితానికి రెండు చుక్కల పల్స్‌పోలియో చుక్కలు వేయించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. చిన్నారులు పల్స్‌పోలియో వ్యాధి బారిన పడకుండా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పల్స్‌పోలియో చుక్కల పంపిణీ ఏర్పాట్లపై  జిల్లా టాస్క్‌ఫోర్సు కమిటీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 94,214 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 606 పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేసి 24 గంటలు విధులు నిర్వహించేందుకు దశల వారీగా సిబ్బంది విధులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. స్లమ్‌, హైరిస్క్‌ ఏరియాల్లో ఎక్కడ చిన్నారులు తప్పిపోకుండా 38 ప్రత్యేక మొబైల్‌ బృందాలు, 64 మంది సూపర్‌వైజర్లను నియమించామన్నారు. అస్పత్రుల్లో, ఇటుక తయారీ బట్టీలు, బహుల అంతస్తుల నిర్మాణ ప్రదేశాల్లో పనిచేస్తున్న మైగ్రేట్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పల్స్‌ పోలియో కేంద్రాలు నిర్వహించాలని ఆదేశించారు. చుక్కలు వేసిన చిన్నారులకు గుర్తింపు మార్కింగ్‌ చేయాలన్నారు. ఈ నెల 20,21,22 తేదీల్లో ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి తప్పిపోయిన చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని, పల్స్‌పోలియో కార్యక్రమంలో ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్‌ విద్యార్థులు, మున్సిపల్‌, అంగన్‌వాడీ సిబ్బందిని ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

అవగాహన ర్యాలీలు

పల్స్‌పోలియోపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించాలని, గ్రామాల్లో ముందస్తుగా టాంటాం చేయించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని, విద్యార్థులు పల్స్‌పోలియో చుక్కలు వేసుకునేందుకు ప్రార్థన సమయంలో పల్స్‌ పోలియో గురించి వివరించాలని కలెక్టర్‌ సూచించారు. గతంలో జరిగిన లోపాలను అధికమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రూట్‌ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మెడికల్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రైల్వే, బస్టాండ్లలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున అనౌన్స్‌మెంట్‌ చేయించాలని, అందుకు సంబందిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్మిక శాఖ సాయంతో పనిచేసే ప్రాంతం వద్దనే పిల్లలకు చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో కవరేజ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. పట్టణ హెల్త్‌ సెంటర్ల వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పట్టణంలోని హైరిస్క్‌  ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్‌ కలెక్టర్‌ ఎం మనుచౌదరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ గీతా, ఎస్‌ఎంవో డాక్టర్‌ మురారి రాజేంద్రప్రసాద్‌, ఐఏపీ డాక్టర్‌ ప్రతాప్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ కే శ్రీనివాస్‌, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ టీ మదన్‌మోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎండీ యాకూబ్‌పాషా, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ రాజారెడ్డి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


logo