ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 15, 2020 , 03:02:01

మెడికోల అటెండెన్స్‌ సమస్య కొలిక్కి వచ్చేనా..!

మెడికోల అటెండెన్స్‌ సమస్య కొలిక్కి వచ్చేనా..!


పోచమ్మమైదాన్‌, జనవరి 14: వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థుల అటెండెన్స్‌ సమస్య ఇక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ నెల చివరలో జరుగే ఫైనల్‌ పరీక్షకు ఫీజు చెల్లించే చివరి తేదీ బుధవారం కావడంతో విద్యార్థులు ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలను అధికారులకు విన్నవించడంతో పాటు విచారణ కమిటీ దృష్టికి తీసుకరాగా వారు తమకు అనుకూలంగా  అవకాశం కల్పిస్తారనే ధీమాతో ఉన్నారు. అలాగే ఉన్నతాధికారుల నుంచి కూడా తగిన నిర్ణయం నేడో, రేపో రానున్నట్లు తెలుస్తుంది.కేఎంసీలో చదువుతున్న ఎంబీబీఎస్‌ సెకండియర్‌, థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులకు తగిన అటెండెన్స్‌ లేకపోవడంతో అధికారులు వారు పరీక్షకు అనర్హులని (డీటెయిన్‌) ప్రకటించిన విషయం విధితమే. ఇందులో ఎక్కువగా ఎక్కువ సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఎస్‌పీఎం) విద్యార్థులే ఉండటంతో వారు ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు ఒకేసారి డీటెయిన్‌ కావడం కళాశాలలో కలవరం రేపింది. ఫైనల్‌ పరీక్ష రాయకుంటే ఆరునెలల పాటు అవకాశం లేకపోవడంతో పాటు చదువులో రిమార్క్‌ వస్తుందని విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎస్‌పీఎంలో 176 మంది తృతీయ సంవత్సరం, అలాగే తృతీయ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మైక్రోబయోలజీలో 42 మంది, పెథాలజీలో 16 మంది, ఈఎన్‌టీలో 15 మంది, ఆఫ్తల్మాలజీలో 16 మంది, ఫార్మా కాలేజీలో 11 మంది చొప్పున ఫైనల్‌ పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోయిన విషయం విధితమే.

నేటితో పరీక్ష ఫీజుకు చెల్లింపునకు ఆఖరు

ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఫైనల్‌ పరీక్షలకు ఫీజు చెల్లించే తేదీ ఈ నెల 15న కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటెండెన్స్‌ 75 శాతం లేకపోవడంపై అన్ని డిపార్ట్‌మెంట్ల హెచ్‌వోడీలు చర్చలు జరిపినప్పటికీ తగిన నిర్ణయం తీసుకోలేకపోయారు. కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. చివరకు డీఎంఈకి సమాచారం అందించడంతో నలుగురు సీనియర్‌ ప్రొఫెసర్లచే మంగళవారం విచారణ జరిపించారు. వీరి రిపోర్టు ఆధారంగా విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉంది.  కాగా విద్యార్థుల అటెండెన్స్‌కు సంబంధించిన విచారణ రిపోర్టు డీఎంఈతో పాటు ప్రిన్సిపల్‌ సెక్రటరీకి చేరిందని, దీనిపై వారు నిర్ణయం తీసుకుంటారని కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య తెలిపారు.  అలాగే ఫీజు చెల్లింపు విషయంలో అవసరాన్ని బట్టి గడువు పెంపుపై ఆలోచిస్తామని  వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. కాగా అధికారులు రూ.200ల అపరాద ఫీజుతో ఈ నెల 18 వరకు, రూ.5000ల అపరాద ఫీజుతో ఈ నెల 21 వరకు గడువును అధికారులు ప్రకటించారు.logo