ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 15, 2020 , 03:01:23

ఇద్దరు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌

ఇద్దరు గంజాయి రవాణాదారుల అరెస్ట్‌మట్టెవాడ, జనవరి 14 : శుద్ధ్ది చేసిన  గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 26 కిలోల ఎండు గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ నాగరాజు తెలిపారు. వరంగల్‌ ఏసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై ఎం శ్రీనివాస్‌ , ఏస్సై కొత్త సంపత్‌కుమార్‌, కానిస్టేబుల్‌ ఆర్‌ కిరణ్‌, హోం గార్డులు వరంగల్‌ బస్టాండ్‌ ఏరియాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా  ఓ కారు కనిపించగా ఎస్సై తన సిబ్బంది ఆపి తనిఖీ చేస్తున్న క్రమంలో అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్లు తెలిపారు. మరో ఇద్దరిని  ప్రశ్నించి తనిఖీ చేయగా అందులో శుద్ధి చేసిన ఎండు గంజాయి 13 ప్యాకెట్లలో ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌కు తెలియజేసి వారి సిబ్బంది పర్యవేక్షణలో పంచనామా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఘన్‌పూర్‌ మండలం ధర్మారావుపేటకు చెందిన యెల్లంకి నరేష్‌, ధర్మసాగర్‌ మండలం నారాయణగిరికి చెందిన పుట్ట వేణును పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.   26 కిలోల గంజాయితో పాటు , దానిని రవాణా చేస్తున్న కారును  స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.  రేగొండ మండలం తిరు మలగిరికి చెందిన వెంకటస్వామి, ధర్మసాగర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డిలను పట్టుకోవాల్సి ఉందన్నారు. వీరంతా భద్రాచలం దగ్గర చింతూరు, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ల నుంచి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద  నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్న క్రమంలో పట్టుకున్నట్లు తెలిపారు. సమావేశంలో వరంగల్‌ ఏసీపీ ఎస్‌ సారంగపాణి, ఇంతేజార్‌గంజ్‌, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్లు  రాయల వెంకటేశ్వర్లు ,   గణేష్‌, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు. చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అభినందించడంతో పాటు రివార్డ్‌ అందజేయడం జరుగుతుందని డీసీపీ నాగరాజు తెలిపారు.


logo