మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Jan 14, 2020 , 03:30:40

ఎన్నికలంటే విపక్షాల్లో వణుకు

ఎన్నికలంటే విపక్షాల్లో వణుకు
  • ఆ పార్టీలకు డిపాజిట్‌ కూడా దక్కదు
  • అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా
  • ఘన విజయం ఖాయం
  • చేతకాకనే కాంగ్రెస్‌ నేతల సవాళ్లు
  • వర్ధన్నపేటపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
  • పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
  • ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణతో ఎన్నికలంటే విపక్షాలకు వెన్నులో వణుకు పుడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి చెందితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ కేటీఆర్‌కు సవాల్‌ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి సవాళ్లు అనేకసార్లు కాంగ్రెస్‌ నేతలు విసిరి బోర్లాపడ్డారని ఎద్దేవా చేశారు. 22న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని పట్టణాల్లో భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కనీసం రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరిలోనూ అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేదని ఆయన అన్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప ఒక్క స్థానంలో కూడా గెలువలేరని తెలిపారు.  సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈనెల 22న జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓట్లు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. అలాగే నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.30 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. రానున్న రోజుల్లో రూ.50 నుంచి రూ.60 కోట్ల మేరకు నిధులు విడుదల చేసి వర్ధన్నపేటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే మున్సిపల్‌ ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. 


అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి

-ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ అభ్యర్థులు, నాయకులకు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణం, తండాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, దయాకర్‌రావు సహకారంతో రూ.30 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా అంతర్గత సీసీరోడ్లు, శ్మశానవాటిక, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో వర్ధన్నపేటను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను పార్టీ శ్రేణులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీలు మార్గం భిక్షపతి, సింగులాల్‌, మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, గుజ్జ సంపత్‌రెడ్డి, పాలకుర్తి సారంగపాణి, తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, మిద్దెపాక రవీందర్‌, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.


logo
>>>>>>