గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 13, 2020 , 03:57:01

భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న

భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న
  • - నేటి నుంచి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
  • - ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వేడుకలు
  • - స్వామివారికి పట్నాలు, బోనాలతో మొక్కులు
  • - వేలాదిగా తరలిరానున్న భక్తజనం
  • - ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
  • - సీసీ కెమెరాల నిఘాతో పోలీసుల పర్యవేక్షణఐనవోలు జనవరి 12 :  కోటి వరాలిచ్చే భక్తుల కొంగు బంగారం.. ఆపదలను తీర్చే ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దం పట్టే జానపదుల జాతర ఐనవోలు. అతిపురాతన చరిత్ర కలిగిన ఇక్కడి క్షేత్రమిది. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఉగాది వరకు కొనసాగుతాయి. శివభక్తులకు ప్రీతికరమైన ఐనవోలు పుణ్యక్షేత్రం నేటి నుంచి జనసంద్రం కానుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే గాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు త రలిరానున్నారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, బోనాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా మారనుంది. స్వామి వారికి పట్నాలు వేసి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తజనం కోసం ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.   


మైలారు దేవుడు మల్లన్నగా కొలువుదీరిన ప్రాంతం. కోర మీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా దర్శనం ఇచ్చే ప్రదే శం. 1100 ఏళ్ల చరిత్రతో అంతుకుమించిన విశిష్టమై న కళా సంపద కలిగిన దేవాలయం. ఆష్టోత్తర స్తంభాలు, కాకతీయ కళా సంపద కీర్తితోరణలతో స్వాగతం పలికే గ్రామం. పుట్టుమన్నుతో పూజలు అందుకునే మ ల్లికార్జునస్వామి కొలువుదీరిన ప్రాంత మే ఐనవోలు. శివ భక్తులకు మహా పుణ్యక్షేత్రం. సం కాంత్రి ముందు నుంచి ఉగాది వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలు భక్త జనసంద్రంగా మారుతుంది. ఒగ్గు కథలతో, శివసత్తుల పూనకాలు, దేవుడి పట్నాలు, బోనాలతో సందడిగా మారుతుంది. తెలంగాణ జీవ న విధాననికి జానపదుల సంకృతికి వేదిక ఐనవోలు. అతి పురాతన చరిత్ర గల పుణ్యక్షేత్రం. వ రంగల్‌ మహానగరానికి 16 కిలో మీటర్లు దూరంలో ఉంది. గత ప్రభుత్వం పాలనలో ఈ పుణ్య క్షేత్రానికి తగిన గుర్తింపు లభించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. 


ఐనవోలు విశిష్టత..

రాష్ట్రకూటుల తర్వాత, చాళుక్యుల పాలనలో సామంత రాజులుగా ఉన్న కాకతీ యులు కాలక్రమంలో స్వతంత్ర రాజులుగా ఓరుగల్లు ప్రాంతాన్ని ఏలిన విషయం తెలిసిందే. రాష్ట్ర కూటుల కాలంలోనే ఈ గ్రామం ప్రస్తావన ఉందంటే అత్యంత పురాతన పట్టణమని గుర్తించవచ్చు. రాష్ట్ర కూట రాజు కృష్ణ-2 పాలన కాలం క్రీ.శ 850 నుంచి 914 ఏళ్ల వరకు కొనసాగింది. అంటే దాదాపు 1100 ఏళ్ల ముం దు నుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. కాలక్రమేనా ఈ ప్రాం తాన్ని వెలమ రాజులు పరిపాలన చేసినట్లుగా ఇక్కడి శిలాశాసనంలో పేర్కొనబడి ఉంది. ఇదే సామాజికవర్గానికి చెందిన మార్నేని వంశస్తులు దేవాలయం నిర్వహణ బాధ్యతను కొనసాగించారు. ఆలయ అదాయంలో 50 శాతం మార్నేని వంశస్తులకు చెందితే, మరో 50 శాతం ఒగ్గు, తమ్మల్ల పూజారులు, నాయీబ్రాహ్మణ లు, రజకులకు హక్కుగా ఉండేది. కాలక్రమంలో మార్నేని వంశ స్తులు 1966లో దేవాదాయశాఖకు అప్పంగిచారు. 


గొల్ల కురుమలకు ఇలవేల్పు..

సుమారు పది అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలతో కోర మీ సాలతో చతుర్భుజాలలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పణపాత్రలతో స్వామివారి రూపం దర్శన మిస్తుంది. ఇరువైపు గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. కర్ణాటక పాంత్రంలో పుట్టిన ఖండేలురాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. ఆ యన ఇద్దరి భార్యలలో బలిజమేడల్లమ్మ కర్ణాకట ప్రాం తవాసి. రెండో భార్య గొల్లకేతమ్మ మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన అమ్మవారిగా చెబుతారు. తమ ఆడపచు గొల్లకేత్మమ్మను పెళ్లి చేసుకున్నం దున మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.  


నేటి నుంచి బ్రహ్మోత్సవాలు.. 

మల్లికార్జునస్వామిస్వామి వారి బ్రహ్మోత్సవాలు నేడు ధ్వజారోహణతో ప్రారంభంకానున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు కొనసాగుతాయి. ధ్వజారోహణ రోజు స్వామివారికి నూతన వస్ర్తాలంకరణతోపాటు ప్రత్యేక పూజలతో ఉత్సవా లు ప్రారంభమవుతాయి. 14న మంగళవారం భోగి పండుగ, 15న బుధవారం మకర సంక్రాంతి బండ్లు తిరుగుట, 17న మ హాసంప్రోక్ష సమారాధన, 30వ తేదీన భ్రమరాంభిక అమ్మవారి షష్ఠివార్షికోత్సవం, ఫిబ్రవరి 19న రేణుకాదేవి (ఎల్లమ్మ దేవత) పండుగ నిర్వహించనున్నారు. కాగా మల్లికార్జునస్వామిని వరంగల్‌ నగర కమిషనర్‌ పమేలా సత్పతి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


దారులు ఇవే..

వరంగల్‌ నుంచి వచ్చే భక్తులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి బైపాస్‌ రోడ్డు ద్వారా ఐనవోలు పాఠశాల వెనుక భాగం వాహనాలు పార్కింగ్‌ చేసుకొని కాలి నడకన తూర్పు ముఖం నుంచి ఆలయంలోకి ప్రవేశించాలి. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి వయా కూనూర్‌, గర్మిళ్లపెల్లి మార్గం ద్వారా వచ్చే భక్తులు తాటివనం దగ్గర వాహనాలను ఉంచి కాలినడక ద్వారా తూర్పువైపు నుంచి ఆలయ ప్రవేశం చేయాలి. హైదరాబాద్‌ పెద్దపెండ్యాల వయా వెంకటాపురం నుంచి వచ్చే భక్తులు వెంకటాపురం రోడ్డు ఒంటిమామిడిపల్లి రైస్‌ మిల్లు వద్ద  వాహనాలు పార్కింగ్‌ చేసి, కాలినడకన తెలంగాణతల్లి సెంటర్‌ నుంచి దేవాలయం తూర్పువైపు నుంచి ఆలయ ప్రవేశం చేయాలి. తిమ్మాపురం క్రాస్‌ నుంచి వయా సింగారం, కొండపర్తి గ్రామాల నుం చి వచ్చే భక్తులు ఒంటిమామిడిపల్లి రోడ్డు ఐనవోలు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ దగ్గర వాహనాలను పార్కింగ్‌ చేయాలి. తెలంగాణ సెంటర్‌ నుంచి దే వాలయ తూర్పువైపుగా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆర్‌టీసీ బస్సుల ద్వారా వ చ్చిన భక్తులు కూడా తెలంగాణతల్లి సెంటర్‌ వద్ద బస్సు దిగి కాలి నడకన తూర్పు వైపు నుంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించి, తిరిగి తూర్పువైపు నుంచే బయటి వెళ్లాల్సి ఉంటుంది.  


logo