శనివారం 28 మార్చి 2020
Warangal-city - Jan 13, 2020 , 03:49:16

ప్రజలను మేల్కొలిపిన చంద్రమౌళీశ్వర్‌రావు

ప్రజలను మేల్కొలిపిన చంద్రమౌళీశ్వర్‌రావు

పోచమ్మమైదాన్‌, జనవరి 12: స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను మేల్కొలిపి, వారిని చైతన్యం చేసినవారిలో చంద్రమౌళీశ్వర్‌రావు ఒకరని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయవాది, సంఘ సంస్కర్త భండారు చంద్రమౌళీశ్వర్‌రావు సంస్మరణ సభ కేయూ ఆచార్యులు పెరంబుదూరు లక్ష్మణమూర్తి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పేరొందిన చంద్రమౌళీశ్వర్‌రావు సంస్మరణ రోజు మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద జయంతి కూడా నిర్వహించుకోవడం విశేషమన్నారు. వివేకానందుడు ప్రజలను జాగృతం చేసిన మాదిరిగా చంద్రమౌళీశ్వర్‌రావు ప్రజలను చైతన్య పరచడంలో ముఖ్యపాత్ర వహించారని కొనియాడారు. అలాగే ఆనాడు ప్రగతి వార పత్రికలోని అక్షరాల ద్వారా అందరిని చైతన్యంపరిచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సాహిత్యంతో పాటు కళలకు కాణాచి అయిన ఓరుగల్లులో ఆయన ఇక్కడ జన్మించడం, తాను సంస్మరణ సభకు హాజరు కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చంద్రమౌళీశ్వరరావు చారిటబుల్‌ ట్రస్ట్‌కు కావలసిన సహాయ, సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. 


ముఖ్యంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న కుమారులు డాక్టర్‌ ఉమామహేశ్వర్‌రావు,  ధవలేశ్వర్‌రావు సాహిత్యసేవలు మరువలేనివని ఎమ్మెల్యే  కొనియాడారు. కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ ఆనాడు చంద్రమౌళీశ్వరరావు స్వాతంత్రోద్యమంలో ప్రజలను ఉత్తేజపరచడంతో పాటు న్యాయవాదిగా  వృత్తికి వన్నె తీసుకవచ్చి సేవలు అందించారని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, సీనియర్‌ న్యాయవాది మహేంద్రప్రసాద్‌, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఉమామహేశ్వర్‌రావు, ట్రస్ట్‌ సభ్యులు భండారు ధవళేశ్వర్‌రావు, డాక్టర్‌  ఉమామహేశ్వర్‌రావు, ప్రముఖ కవి రామాచంద్రమౌళి, ప్రొఫెసర్‌ పాండురంగారావు, డాక్టర్‌ లక్ష్మీకాంతరావు, నాయకులు టి.రమేశ్‌బాబు, యెలుగం సత్యనారాయణ, జారతి రమేశ్‌ పాల్గొన్నారు. మాజీ మంత్రి, తాత్వికులు, సామాజిక మార్గదర్శి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు, ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)లకు  చంద్రమౌళీశ్వరరావు స్మారక చారిటబుల్‌ ట్రస్ట్‌ తరుపున పురస్కారాలను అందజేశారు. అలాగే ట్రస్ట్‌కు దాతలుగా ఉన్న ప్రముఖులకు మెమోంటోలను అందజేసి సత్కరించారు.


logo