శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 12, 2020 , 04:08:43

హారతి కుటుంబాన్ని ఆదుకుంటాం

హారతి కుటుంబాన్ని ఆదుకుంటాం
  • -నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తాం
  • -మంత్రి సత్యవతి, చీఫ్‌విప్‌ దాస్యం
  • -మృతురాలి కుటుంబానికి పరామర్శ
  • - వివరాలు 18లో

సుబేదారి, జనవరి 11: తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదనే కసి షాహిద్‌ను ఉన్మాదిని చేసింది. తన ప్రేయసి మరొకరిని ప్రేమిస్తుందనే కోపం..దారుణానికి తెగించేలాచేసింది. నగరంలో ప్రకంపనలు సృష్టించిన  హారతి దారుణ హత్య ఘటనలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చా యి. పోలీసులు నిందితుడు షాహిద్‌ను తమదైన  శైలిలో విచారించడంతో హారతి హత్యకు గల కారణాలు తెలిశాయి. యువతి హత్య జరిగిన తర్వాత 24గంటల వ్యవధిలో శనివారం వరంగల్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో నిందితుడి అరెస్టు వివరాలను సీపీ రవీందర్‌ విలేకరులకు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. హన్మకొండ లష్కర్‌ సింగారానికి చెందిన హారతి, కాజీపేట విష్ణుపురికి చెందిన మహ్మద్‌ షాహిద్‌ 2016 లో హన్మకొండ హంటర్‌రోడ్డులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చదివారు. వీరు చదువుకునే రోజుల్లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిం ది. నిందితుడు పలుమార్లు మృతురాలి ఇంటికి వచ్చి వేళ్లేవాడు. డిగ్రీ తర్వాత షాహిద్‌ బ్యాంకు ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నట్లు చెప్పి హన్మకొండ రాంనగర్‌లోని శాంతినగర్‌లో  గదిని అద్దె తీసుకున్నాడు. ఇక్కడికి అప్పుడప్పుడు హారతి వచ్చిపోతుండేది.

వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి ..

కొద్దిరోజుల క్రితం హారతికి వరంగల్‌ శివనగర్‌కు చెందిన సుకుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతడితో మాట్లాడుతుండేది. అయితే షాహిద్‌తో హారతి గతంలో మాదిరిగా చనువుగా లేకపోవడంతో అనుమానం కలిగిన షాహిద్‌  పలుమార్లు యువతిని ప్రశ్నించారు. నిన్ను తప్ప మరేవరినీ ప్రేమించడం లేదని హారతి  చెప్పింది. అయితే  రెండు రోజుల క్రితం హారతి, సుకుమార్‌ ఫోన్‌కు మేసేజ్‌లు పంపడంతో గమనించిన షాహిద్‌ కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై హారతిని నిలదీయడంతో ఆమె సమాధానం చెప్పలేదు. దీంతో షాహిద్‌ శివనగర్‌లోని సుకుమార్‌ ఇంటికి వెళ్లి హారతి ప్రేమ విషయం చెప్పడంతో సుకుమార్‌ సైతం హారతిని ప్రేమిస్తున్నానని తేల్చిచెప్పాడు. అక్కడి నుంచి వచ్చిన నిందితుడు హారతిని మళ్లీ ప్రశ్నించగా సుకుమార్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. దీంతో  ఆగ్రహానికి లోనైన నిందితుడు హారతిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

ప్లాన్‌ ప్రకారం..

తనను కాదని మరో యువకుడిని ప్రేమిస్తున్నదని షాహిద్‌  రగిలిపోయాడు. తనకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కకూడదనే ఉద్దేశంతో హత్యకు ప్లాన్‌ వేశాడు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం హారతికి ఫోన్‌ చేసి లష్కర్‌ సింగారం ఇంటినుంచి హన్మకొండ మూడుచింతల ప్రాంతానికి పిలిపించుకున్నాడు. కొద్దిసేపు మాట్లాడుకుందామని నమ్మించిన షాహిద్‌  హారతిని బైక్‌పై రాంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకొచ్చాడు.అనంతరం నిందితుడు షాహిద్‌ సుకుమార్‌ ప్రేమ వ్యవహారంపై హారతితో గొడపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో హారతి సుకుమార్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో షాహిద్‌ కీచైన్‌తో గొంతుకోసి హత్యచేశాడు. హత్య తర్వాత కాజీపేటలోని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో సెంట్రల్‌ జైలుకు వెళ్లాడు. అక్కడ ఉన్న జైలు సిబ్బంది సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలని సూచించడంతో షాహిద్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలాన్ని సుబేదారి పోలీసులు పరిశీలించారు. నిందితుడి ద్విచక్రవాహనం, రక్తపు మరకలతో ఉన్న దుస్తువులు, కీచైన్‌ కత్తి స్వాధీనం చేసుకున్నారు. షాహిద్‌పై 302, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.  పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత  నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు, అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి సీఐ అజయ్‌ పాల్గొన్నారు.  సమావేశం తర్వాత  షాహిద్‌ను కోర్టులో హాజరు పరచగా.. కోర్టు నిందితుడికి  జ్యుడీషయల్‌ రిమాండ్‌ విధించింది.


logo