వనపర్తి : పస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందించింది. ఇండియా ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత్ కుమార్, కోఆర్డినేటర్ కరకాల కృష్ణారెడ్డి, శ్రీనివాస్ బండారి, నవీన్ ల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ప్రభుత్వ అసుపత్రి సూపరిండెంట్‌కు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను అందజేశారు. కొవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆప్తులను కోల్పోతున్న వార్తలు విన్న ఆటా సభ్యులు, భువనేశ్వర్ భుజాల అధ్యక్షులు, కొవిడ్ -19 రిలీఫ్ చైర్ పర్సన్ అనిల్ బొద్ధి రెడ్డి, సుధీర్ బండారుల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకొన్నారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను లోహిత్ కుమార్ వివరించారు. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా అవి కూడా త్వరగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆట టీమ్ సభ్యులు డాక్టర్ చైతన్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, వార్డు కౌన్సిలర్లలు పాల్గొన్నారు.