శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Wanaparthy - Jan 30, 2020 , 02:02:32

కుష్ఠు... జరభద్రం

కుష్ఠు... జరభద్రం
  • నేడు కుష్ఠు వ్యాధి నివారణ దినోత్సవం
  • నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు
  • విస్తృత ప్రచారం చేస్తున్న వైద్య సిబ్బంది

వనపర్తి, నమస్తే తెలంగాణ/నారాయణపేట టౌన్‌: కుష్ఠు (లెఫ్రసీ).. ప్రాచీన కాలం నుంచి మానవజాతిని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. మనిషి నాడి మండల వ్యవస్థ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు దీని ప్రభావానికి అతిగా లోనవుతాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజల్లో కుష్ఠు నివారణపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 30న ప్రపంచ కుష్ఠు నివారణ దినోత్సవం జరుపుకొంటున్నాం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్ఠు వ్యాధి నివారణపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకుగాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లా కార్యాలయాల్లో కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

లెప్రే బ్యాక్టీరియాతో..

కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అది పెరిగి చర్మానికి, నరాలకు, కాళ్లు, చేతులు, కళ్లకు హాని కలిగిస్తుంది. ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. చాలా నెమ్మదిగా వ్యాధి లక్షణాలు బహిర్గతమవుతాయి. ఇది బహిర్గతం కావడానికి సగటున మూడేండ్లు పడుతుంది. ప్రారంభ దశలో గుర్తించి మల్టీ డ్రగ్‌ థెరఫీ తీసుకుంటే వ్యాధి అంగవైకల్యానికి దారితీయదు. చికిత్స పూర్తయిన, చికిత్స తీసుకుంటున్న రోగుల్లో అంగవైకల్యం ఉంటే శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చు. ఈ వ్యాధిని రెండు రకాలుగా గుర్తించి వాటికి వైద్యాన్ని అందిస్తారు. మొదటగా ఎంబీ (మల్టీ బ్యాచ్‌లరీ) అంటే మచ్చల సంఖ్య, స్పర్శ కోల్పోయిన వారికి ఏడాదిపాటు చికిత్స అందిస్తారు. రెండోది పీబీ (పాసి బ్యాచులరీ) ఇది కూడా మచ్చల సంఖ్య, స్పర్శ కోల్పోయిన వారికి ఆరు నెలలపాటు చికిత్స అందిస్తారు. 20శాతం మానవుడికి ఇది అంటువ్యాధి. ఈ వ్యాధి కేవలం బ్యాక్టీరియా ద్వారానే (దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు) మాత్రమే సోకుతుంది. ఈ వ్యాది లక్షణాలు బయట పడటానికి 6 నెలల నుంచి 20ఏండ్ల  సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఇంక్‌పేషెంట్‌ పీరియడ్‌ అని అంటారు.

వ్యాధి లక్షణాలు

శరీరంపై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ఉంటే.. 

మచ్చలపై స్పర్శ లేనప్పుడు, నొప్పి తెలియకుంటే. 

పాదాలు, చేతులు, వేళ్ల తిమ్మిర్లు ఉన్నా, చర్మం దళసరిగా మారితే.

చర్మం.. ముఖ్యంగా ముఖం నూనె రాసినట్లుగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నా. 

కుష్టు వ్యాధి వంశపారంపర్యం కాదు.

కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చు, వయస్సు, లింగ భేదం లేదు. 

వ్యాధి నివారణ ఇలా..

లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బహుళ ఔషధ చికిత్స ద్వారా నయం చేయవచ్చు. మొదటి దశలోనే వ్యాధిని గుర్తించి మందులు వాడితే అంగవైల్యాన్ని నివారించవచ్చు. కుష్ఠు వ్యాధికి శక్తివంతమైన చికిత్స 1930 సంవత్సరం నాటికే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఔషధాలను అవసరానికి మించి ఉపయోగించడం కారణంగా వ్యాధి చికిత్సకు లొంగకుండా పోయింది. 1980లో బహుళ ఔషధ చికిత్స అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరిగి విజయవంతంగా చికిత్స చేయడం సాధ్యమైంది. వ్యాధి తీవ్రతను అనుసరించి ఈ చికిత్సలో ఆరు నెలలు లేదా 12 నెలలు సక్రమంగా మందులు తీసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి.

ప్రత్యేక కార్యాచరణ

కుష్ఠు వ్యాధి నివారణే ధ్యేయంతో అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 30వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామసభలలో ముఖ్యంగా సర్పంచ్‌ కుష్ఠు వ్యాధి లక్షణాలు, వ్యాధి వ్యాప్తి చెందే విధానం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించాలి. అనంతరం ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు, గ్రామస్తులు ఈ గ్రామసభకు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆయా గ్రామాలలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వ్యాధిగ్రస్తులను గుర్తించనున్నారు. 

వివక్ష చూపొద్దు

సమాజంలో కుష్ఠు వ్యాధి ఉన్నవారిపై వివక్ష చూపొ ద్దు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆశా కార్యకర్తలను, ఏఎన్‌ఎంలను, ఆరోగ్య కేంద్రం లో సంప్రదించి అనుమానం తొలగించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీని ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించుకోవచ్చు.  

- డాక్టర్‌ రాఘవేందర్‌,  ప్రోగ్రాం ఆఫీసర్‌, నారాయణపేట  

అవగాహన కల్పిస్తున్నాం

కుష్ఠు వ్యాధిపై ప్రజలకు ఏటా జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వర కు అవగాహన కల్పిస్తు న్నాం. వ్యాధి మొదటి దశలో గుర్తించి చికిత్సను అందించినట్లయితే అంగవైకల్యం బారిన పడకుండా చూడటానికి అవకాశం ఉంది. ప్రజలకు ఆశా కార్యకర్తలు, మేల్‌ వర్కర్స్‌, సూపర్‌వైజర్లతో వైద్య సిబ్బంది  ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్యాన్ని అందించడం జరిగింది. 

- డాక్టర్‌ రవిశంకర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌, వనపర్తి 


logo