శనివారం 06 మార్చి 2021
Wanaparthy - Jan 27, 2021 , 00:15:33

ఓటీపీతో రేషన్‌

ఓటీపీతో రేషన్‌

  • ఐరిష్‌తోనూ రేషన్‌ సరుకుల పంపిణీ
  • కరోనా కట్టడికి వేలిముద్ర విధానం రద్దు
  • ఆధార్‌కార్డ్‌కు ఫోన్‌ నెంబర్‌ లింక్‌ తప్పనిసరి
  • వచ్చేనెల నుంచి ప్రారంభం 
  • థర్డ్‌పార్టీ విధానం రద్దు
  • వనపర్తి జిల్లాలో1,54,165 రేషన్‌ కార్డులు

 వేలిముద్రలతో రేషన్‌ సరుకులు పంపిణీ చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని భావించిన ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. వచ్చే నెల నుంచి ఓటీపీ, ఐరిష్‌తో  సరుకులను పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రేషన్‌బియ్యం అక్రమార్కుల చేతికి చిక్కకుండా థర్డ్‌పార్టీ విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది. ఓటీపీ కోసం లబ్ధిదారులు ఆధార్‌కార్డ్‌కు ఫోన్‌ నెంబర్‌ను తప్పని సరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

వనపర్తి, జనవరి 26(నమస్తే తెలంగాణ)‌: వనపర్తి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా మొత్తం కార్డులు 1,54,165 రేషన్‌ కార్డులను ప్రజలకు అందజేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం అందించిన ఉచిత బియ్యాన్ని 1,37,437 కార్డుదారులు అందుకున్నారు. ప్రతి వ్యక్తి 12కిలోల బియ్యం చొప్పున రేషన్‌ పొందిన వారందికి 1,19,87,224 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందించారు. రూ.1500 సాయాన్ని 1,37,406 మంది అందుకున్నారు. 

రేషన్‌ దుకాణాల్లో సాంకేతికత

రేషన్‌ బియ్యాన్ని పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుంది. ఇది వరకు రిజిస్టర్‌లో సంతకం చేసే విధానాన్ని స్వస్థి పలికి ఈ పాస్‌ ద్వారా రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. లబ్ధిదారులు కార్డుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసి వారి వేలి ముద్రలు, ఐరిష్‌,ఆధార్‌ కార్డుల ద్వారా సేకరించారు.  వీటితో పాటు ప్రభుత్వం ఓటీపీ విధానాన్ని కూడా నూతనంగా ప్రవేశపెడుతున్నది. లబ్ధిదారులు రిజిస్టరైన మొబైల్‌ నంబర్‌కు వన్‌టైం పాస్‌ వర్డ్‌ను పంపించి వాటి ద్వారా కూడా రేషన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆధార్‌ కార్డ్‌కు ఫోన్‌ నెంబర్‌ జతలేనివారికి ఓటీపీ ద్వారా రేషన్‌ సరుకులు ఇవ్వడం సాధ్యం కాదు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌కార్డ్‌కు ఫోన్‌నెంబర్‌ను జతచేసుకోవాలి. ఈ విధానంతో వేలిముద్రలు సరిగాలేని వారికి లాభం చేకూరడంతో పాటు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చును. 

థర్డ్‌పార్టీ విధానం రద్దు

వేలిముద్రలు సరిగా లేని లబ్ధిదారులకు రేషన్‌ అందించేందుకు ప్రభుత్వ థర్డ్‌ పార్టీ సదుపాయాన్ని అమలు పరుస్తున్నది. ఈ విధానం ద్వారా గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, వీఆర్‌ఏ, సర్పంచ్‌, వార్డు సభ్యుల వేలి ముద్రల ఆధారంగా థర్డ్‌ పార్టీ ద్వారా లబ్ధిదారులకు రేషన్‌ బియ్యాన్ని అందిస్తున్నారు. అయితే ఈ విధానం ద్వారా రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దుచేసి, ఓటీపీ విధానాన్ని అమలు పరుస్తున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాలో ..

జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూరు,గద్వాల రెండు నియోజకవర్గాల్లో 12మండలాల్లో 334 చౌకధర దుకాణాలున్నాయి. 6,04,918 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా 33,44,480 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వచ్చె నెల నుంచి ఐరిష్‌ ద్వారానే రేషన్‌ సరుకులు పంపిణీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 

VIDEOS

logo