మంగళవారం 02 మార్చి 2021
Wanaparthy - Jan 21, 2021 , 00:25:05

దేవాదాయ భూములను పరిరక్షిస్తాం

దేవాదాయ భూములను పరిరక్షిస్తాం

  • కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటాం
  • బెక్కెం రామలింగేశ్వరస్వామి ఆలయ  భూముల రక్షణకు కమిటీ
  • ఎండోమెంట్‌ ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ కమిషనర్‌ రమాదేవి

చిన్నంబావి, జనవరి 20 : దేవాదాయ భూములను పరిరక్షిస్తామని ఎండోమెంట్‌ ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ కమిషనర్‌ రమాదేవి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని బెక్కెం రామలింగేశ్వరస్వామి ఆలయ భూములను అధికారులతో కలిసి పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ దేవాదాయ భూముల విక్రయాలు, మార్పిడి, ఆక్రమణల నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. చిన్నంబావి ప్రాంతంలో తప్పుడు ఓఆర్‌సీలపై క్రయవిక్రయాలు జరిగిన 183 నుంచి 190 సర్వేనెంబర్లలోని 26.31 ఎకరాల ఆలయ భూములను పరిశీలించి స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. వాటిలో ఏమైన కట్టడాలు ఉంటే అవసరమైన వాటిని స్వాధీనపరుచుకుని, నిరుపయోగమైన వాటిని కూల్చివేసి స్థలాన్ని పరిరక్షిస్తామన్నారు. వాటిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే వివరాలతో తమను సంప్రదించాలని సూచించారు. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ భూములపై ఎలాంటి ఓఆర్‌సీ చెల్లదని, భూములపై రెవెన్యూ శాఖ అధికారులు ఇచ్చిన పత్రాలు చిత్తు కాగితాలతో సమానమన్నారు. బెక్కెం రామలింగేశ్వరస్వామి భూములను శిస్తు చేసుకుని వచ్చే ఆదాయంతో ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఆలయ భూములను విక్రయించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. త్వరలోనే చిన్నంబావి ప్రాంతంలో దేవాదాయ భూముల పరిరక్షణకు కమిటీ వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, అధికారులు వెంకటేశ్వరమ్మ, వీణ, కవిత, ఈవో సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo