శనివారం 06 మార్చి 2021
Wanaparthy - Dec 26, 2020 , 01:14:05

మార్మోగిన గోవింద నామస్మరణ

మార్మోగిన గోవింద నామస్మరణ

  • భక్తులతో కిటకిటలాడిన రంగనాథస్వామి ఆలయం
  • ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు

శ్రీరంగాపూర్‌: మండల కేంద్రంలోని రంగనాథస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణతో రంగనాథస్వామి ఆలయం మార్మోగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శించుకుంటే మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని ఆలయ అర్చకులు తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచే శ్రీదేవి, భూదేవి సమేతంగా రంగనాథస్వామిని భక్తులకు ఉత్తర ద్వారా గుండా దర్శించుకున్నారు. రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 10రోజుల పాటు నిర్వహిస్తారని, భక్తులు స్వామివారికి జరిగే ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ అర్చకులు సూచించారు.

వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు

వనపర్తి టౌన్‌: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు వనపర్తి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సత్యచంద్రారెడ్డి, చైర్మన్‌ రఘునాథాచార్యులు మంగళవాయిద్యాలతో మంత్రి దంపతులను ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం వారిని గజమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్‌, ముస్లింల పవిత్ర శుక్రవారం సర్వమత సమ్మేళనమని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం అర్చన, హారతితో మంత్రి దంపతులను ఆశీర్వదించారు. 

పులకించిన కురుమూర్తి గిరులు

దేవరకద్ర రూరల్‌: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం చిన్నచింతకుంట మం డలం అమ్మాపూర్‌లోని కురుమూర్తి గిరులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు కోనేటిలో స్నానమాచరించి కాంచనగుహలోని వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణం జరిపించారు. భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు.

VIDEOS

logo