శుక్రవారం 22 జనవరి 2021
Wanaparthy - Dec 04, 2020 , 02:05:33

డిజిటల్‌ పంచాయతీలు

డిజిటల్‌ పంచాయతీలు

  • కార్యదర్శులకు ఆన్‌లైన్‌ నమోదులో సమస్యలు
  • అధిగమించేందుకు సర్కార్‌ నిర్ణయం
  • అన్ని జీపీలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఎక్విప్‌మెంట్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు

వనపర్తి, నమస్తే తెలంగాణ : పల్లెలు అభివృద్ధి దిశ లో పయనించేందుకు ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పరిపాలన వేగవంతానికిగానూ పంచాయతీ కార్యదర్శులకు సదుపాయంగా ఉండేలా ప్రభుత్వం సకల సదుపాయాలను కల్పించింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపడుతున్న పనుల స్థితిగతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. మారుమూల గ్రామాల్లో టెలిఫోన్‌ సిగ్నల్స్‌ లేకపోవడం, ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు ప్రతి గ్రామపంచాయతీకి ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇందుకు సంబంధించి వనపర్తి జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో ఆన్‌లైన్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతి కార్యాలయానికి కావాల్సిన సామగ్రిని సరఫరా చేయనున్నది. 

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆత్మ పల్లెల్లోనే దాగి ఉందని చెప్పిన సీఎం కేసీఆర్‌ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. దశాబ్దాలుగా చెత్తాచెదారాలు, పురాతన భవనాలు, మురుగు కాలువలతో నిండిపోయిన గ్రామాలు పల్లెప్రగతితో స్వచ్ఛపల్లెలుగా దర్శనమిస్తున్నాయి. అన్నదాతల కోసం రైతువేదికలను ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు.  పూర్తి స్థాయిలో కార్యదర్శులను నియమించి ప్రతి పల్లె అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చర్యలు చేపట్టారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు..

గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్ని నిధులు చేరుకున్నాయి..?, వాటిలో ఎంత ఖర్చు చేశారు..? ప ల్లెప్రగతి, ప్రకృతివనం, జనన, మరణాలు, పన్నుల వసూలు వంటి వివరాలను ఎంట్రీ చేయాలి. ప్రతి ఏడాది మాన్యువల్‌గా చేసే ఆడిటింగ్‌ను గతేడాది నుంచి ఆన్‌లైన్‌ లో నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శు లు జీపీలో ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులు, రశీదులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటిన్నింటినీ ప్రతి జీపీలోని మేనేజ్‌మెంట్‌ బుక్‌లో నమోదుచేసి వాటిని స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లోపొందుపరుస్తున్నారు. ఆన్యూవల్‌ రిపోర్ట్‌లో జనరల్‌ఫండ్‌, ఎస్‌ఎఫ్‌సీ, 14వ, 15వ ఫైనాన్స్‌లకు సంబంధించి ఆదాయ వ్యయాలు నమోదుచేస్తారు. ఓపెనింగ్‌, క్లోసింగ్‌ బ్యాలె న్స్‌ వివరాలు స్పష్టంగా పొందుపరుస్తారు. ఈ వివరాలను ఉన్నతాధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తారు.

పనిభారం తగ్గుతుంది..


కార్యాలయంలో పనిచేసే ప్రతీది ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మధ్యాహ్న సమయంలో మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ చాలా సమయం వేచి ఉండి ఆన్‌లైన్‌ చేసుకోవాల్సి వస్తున్నది. దీంతో సమయభారం పెరిగి ఇబ్బందులకు గురువుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్‌ సౌకర్యం అందించనున్నది. దీంతో సమయభారం తగ్గి ప్రజలకు మరింత సేవలను అందించడానికి వీలుకలుగుతుంది. 

- వై.శంకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, చిమనగుంటపల్లి, వనపర్తిlogo