సోమవారం 18 జనవరి 2021
Wanaparthy - Dec 01, 2020 , 05:01:34

భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు

భక్తిశ్రద్ధలతో కార్తీక పూజలు

  • జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడిన ఆలయాలు
  • దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన మహిళలు
  • పలు ఆలయాల్లో అభిషేకాలు, సాముహిక వ్రతాలు

వనపర్తి టౌన్‌/రూరల్‌ : కార్తీక పౌర్ణమి సందర్భం గా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాలు దీపారాధనతో వెలుగులు విరజిమ్మాయి. శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తాదులు భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజించి దీపారాధన చేశారు. పలు ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సామూహిక వ్రతాలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాల్లోకి చేరిన భక్తులు ఆకాశ దీపాలు, పూజలు నిర్వహించారు. మార్కెట్‌ గంజిలోని లక్ష్మీ గణపతి ఆలయంలో శివుడికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు లక్ష దీపోత్సవం, ఆకాశ దీపం నిర్వహించారు. రామాలయం, వేంకటేశ్వర ఆలయాల్లో అభిషేకాలతోపాటు సాముహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జ్వాలతోరణం, ఆకాశదీపం, పార్వతి పరమేశ్వరులకు పూజ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. వనపరి మండలం కిష్టగిరి ఆలయంలో పూజరి రవీంద్రరావు ఆధ్వర్యంలో కార్తీక దీపాత్సోవం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకూర్‌ గ్రామంలోని సీతారామ ఆలయంలో, చీమనగుంటపల్లిలో ఆంజనేయస్వామి ఆలయంలో, సవాయిగూడెంలో బ్రహ్మంగారి, శివాలయంలో, చందాపూర్‌ గ్రామంలోని పలు ఆలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి పూజలు, వ్రతాలు చేశారు. కార్యక్రమాల్లో పూజారులు గణేశ్‌శర్మ, కౌడన్యశర్మ, రఘునాథచారి, ప్రవీణ్‌స్వామి, గురుస్వామి, ఆలయ ధర్మకర్త రఘునాథచార్యులు, సత్యనారాయణరెడ్డి, బాలీశ్వరయ్య, మేనేజర్‌ చెన్నయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, శ్రీనివాసులు, యువజన సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌, పాండు, ప్రభాకర్‌, పురుషోత్తం, రాములు, శ్రీనివాసులు, మహిళలు మంజుల, భారతి, భాగ్య ఉన్నారు. 

వైభవంగా శివపార్వతుల కల్యాణం

కొత్తకోట : కార్తీక మాసం, పౌర్ణమి సందర్భంగా సోమవారం మండలంలో ఉన్న శివాలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. మండలం లో కానాయపల్లి స్టేజి సమీపంలో ఉన్న దత్తకోటిలింగేశ్వర ఆలయంలో వనపర్తి జిల్లా జడ్జి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జడ్జిని ఆలయ నిర్వాహకులు శేఖరయ్య, మహేశ్వర్‌ శాలువాతో సత్కరించారు. ఆలయంలో శివపార్వతుల కల్యాణం, ఉమమహేశ్వర వ్రతం నిర్వహించారు. మండలంలోని పామాపురం గ్రామంలో ఉన్న రామేశ్వర ఆలయంలో భక్తులు శివలింగానికి అభిషేకాలు చేశారు. పట్టణంలోని పాత శివాలయం, అంబ భవాని ఆలయంలో, చంద్రమౌళీశ్వర మార్కండేయ ఆలయంలో భక్తులు శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నర్సింహ, శేఖర్‌, సత్యనారాయణ, నాగరాజు, అర్చకులు అనిల్‌, అయ్యప్ప, నటరాజ్‌ పాల్గొన్నారు. 

గోపాల్‌పేటలో..

  గోపాల్‌పేట : కార్తీక మాసం సందర్భంగా మండలంలోని బుద్దారం శ్రీగండి ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తులు సత్యనారాయణ స్వామి వ్రాతలు చేశారు. ఆలయ ఆవరణలో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు గ్రామానికి చెందిన డాక్టర్‌ నారాయణ అన్నదానం చేశారు.

పెబ్బేరు మండలంలో..

పెబ్బేరు రూరల్‌ : కార్తీక పౌర్ణమి పర్వదిన వేడుకలు పెబ్బేరు మండలంలో సోమవారం ఘనంగా జరిగాయి. అన్ని శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున శివపార్వతులను భక్తి శ్రద్ధలతో కొలిచారు. మహిళలు దీపారాధనలు నిర్వహించి భక్తి భావాన్ని చాటారు.  సూగూరులోని తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో బుచ్చిబాబు, సితారవెంకటేశ్వర్లు, రాజు, రాములు, శ్రీనివాసులు, ఈశ్వర్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 

ఆత్మకూరులో..

  ఆత్మకూరు : ఆత్మకూరు, అమరచింతలలోని శివాలయాలతోపాటు వైష్ణవ ఆలయాలు, ఆత్మకూరు షిరిడిసాయి బాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు యువతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలోని బాలబ్రహ్మేశ్వరస్వామి దేవాలయం, నీలకంఠేశ్వరస్వామి ఆలయం, చెరువులోని పరమేశ్వరస్వామి ఆల యం, మల్లాపురం ఆంజనేయస్వామి ఆలయం, కోట్లఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. ఆయా దేవాలయాల్లో ఉసిరి చెట్టు కింద సత్యనారాయణస్వా మి వ్రతం, సామూహిక వ్రతాలు చేశారు. ఆరెపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో తులసి మొక్కకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఆత్మకూరు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం ఏర్పాటు చేసిన దీపోత్సవంలో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. జ్వాలాతోరణం వేడుకకు భక్తాదులు పెద్దసంఖ్యలో పాల్గొని పరమశివుడి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భం గా స్థానిక బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రియాదవ్‌ దంపతులు, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

మదనాపురంలో..

మదనాపురం : మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల ఆలయాలకు సోమవారం భక్తులు పోటెత్తారు. మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయంలో అర్చకులు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో విశిష్ట పూజలు నిర్వహించారు. అదేవిధంగా అయ్యప్ప భక్తులు మాలధారణ చేశారు. కార్యక్రమంలో అర్చకుడు గోపిస్వామి, ఆలయ ప్రెసిడెంట్‌ జ్ఞానేశ్వర్‌శెట్టి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

చిన్నంబావిలో..

చిన్నంబావి : మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో భక్తు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి భక్తులు కృష్ణానదిలో పవిత్ర స్నా నాలు ఆచరించి ఇష్టదైవాలకు పూజలు చేశారు. కొప్పునూరు ఆంజనేయస్వామి ఆలయంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.