బుధవారం 27 జనవరి 2021
Wanaparthy - Nov 26, 2020 , 02:19:16

పరిసరాల పరిశుభ్రత.. అందరి బాధ్యత

పరిసరాల పరిశుభ్రత.. అందరి బాధ్యత

  • ప్రతి మంగళవారం స్వచ్ఛ సర్వేక్షణ్‌
  • వార్డుల్లో శుభ్రతపై ప్రజలకు అవగాహన
  • ప్రజల సహకారంతోనే ముందడుగు
  • 2020లో వనపర్తి మున్సిపాలిటీకి సౌత్‌ ఇండియాలో 51వ, రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు

వనపర్తి : పట్టణంలో నిత్యం పారిశుధ్య సమస్యలు తలెత్తడం సహజం. అయితే పారిశుధ్యాన్ని తొలగించి స్వచ్ఛత వైపు అడుగులు వేసేలా మున్సిపల్‌ అధికారులు అడుగు ముందుకేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో వనపర్తి మున్సిపాలిటీలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేస్తూ వారంలో మంగళవారం స్వచ్ఛతకు కేటాయిస్తున్నారు. స్వచ్ఛ వనపర్తిగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌  చైర్మన్‌ గట్టుయాదవ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి వార్డుల్లో ప్రజలతో మమేకమై పారిశుధ్యపనులు చేయిస్తున్నారు.  

సౌత్‌ఇండియాలో 51, రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలను రెండు విభాగాలుగా విభజించి 2018 నవంబర్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా ఒకరోజు ఎంపిక చేసుకొని రెండు నెలలపాటు పట్టణాల్లో స్వచ్ఛతపై ప్రజలకు వివరిస్తూ మున్సిపల్‌ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించాలి. రెండు నెలలు పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ఆయా పట్టణాల్లోని పలు వార్డులను సందర్శించి స్వచ్ఛతను పరిశీలిస్తారు. అనంతరం ర్యాంకులను కేటాయిస్తారు. 2018లో వనపర్తి మున్సిపాలిటీకి 540వ ర్యాంకు, 2019లో 266వ ర్యాంకు రాగా  ఈ ఏడాది సౌత్‌ ఇండియా స్థాయిలో 51వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు వచ్చిందని మున్సిపల్‌ కమిషనర్‌ వెల్లడించారు. ప్రజలు, సిబ్బంది, నాయకుల సహకారంతో వార్డుల వారీగా స్వచ్ఛ సర్వేక్షణ్‌, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగడంతో పట్టణ పరిశుభ్రత మెరుగుపడిందని కమిషనర్‌ వెల్లడించారు. 

ప్రతి మంగళవారం స్వచ్ఛసర్వేక్షణ్‌ 

మున్సిపాలిటీ ర్యాంకు కోసం ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, ప్రతి మంగళవారం కొనసాగిస్తే ప్రజల్లో సామాజిక బాధ్యత గుర్తు చేస్తున్నదన్న ఆలోచనతో అప్పటి వనపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ రజినీకాంత్‌రెడ్డి కార్యక్రమం ప్రతి వారం నిర్వహించేలా కృషిచేశారు. ఇదే కార్యక్రమాన్ని ప్రస్తుత మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌ గట్టుయాదవ్‌ క్రమం తప్పకుండా స్థానిక వార్డు కౌన్సిలర్లు, ప్రజలు, సిబ్బంది పాలుపంచుకునేలా చేయడంతోపాటు అవగాహన కల్పిస్తున్నారు. 

అవగాహన కార్యక్రమాల్లో సూచనలు 

ప్రతి ఇంట్లో రెండు చెత్త బుట్టలను వేర్వేరుగా పెట్టుకోవాలి. ఒక దాంట్లో తడి, మరొక దాంట్లో పొడి చెత్తను వేయాలి.

కూరగాయలు, పండ్ల తొక్కలు, మాంసపు ఎముకలు, చేపల ముండ్లు, చద్దన్నం, కూరలు, ఆకుకూరల కాడలు, వాడిన టీపొడి వంటి వాటిని తడి చెత్తలో వేయాలి.

పేపర్‌, ప్లాస్టిక్‌, గాజు ముక్కలు, అట్టముక్కలు, ప్యాకింగ్‌ కవర్లు, మందుబిల్లలు, గాజు సీసాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు, ఇనుప ముక్కలు, విరిగిన పాత సామన్లు మొదలగు వాటిని పొడి చెత్తలో వేయాలి. 

ఇంట్లో చెత్తను పార్సిల్‌, ప్యాకింగ్‌ కవర్లను ఇంటి బయట ఖాళీ ప్రదేశాల్లో, డ్రైనేజీల్లో విసురొద్దు. దీంతో డ్రేనేజీ పూడుకుపోయి నీటి ప్రవా హానికి ప్లాస్టిక్‌ అడ్డుపడి  దుర్గంధం వెదజల్లి అనారోగ్యాలకు కారణంగా నిలుస్తుంది. ఖాళీ ప్రదేశంలో చెత్త వేయడం వల్ల దోమల వ్యాప్తి పెరుగుతుంది. 

మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచే సంచి తీసుకెళ్లాలి.

సంతోషంగా ఉంది

మున్సిపాలిటీలో ప్రతి మంగళవారం వార్డుల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో పాలు పంచుకోవడం సంతోషం గా ఉంది. వారంలో ఒకరోజు పరిశుభ్రతపై ప్రజలకు వివరించడంతో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పడం కంటే ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతృప్తినిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలి.  

- గట్టుయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వనపర్తిlogo