బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Nov 19, 2020 , 05:26:21

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

గోపాల్‌పేట : రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌలతుగా ఉండేందుకు ప్రభుత్వం రైతులకు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతుల నష్టపోకుండా ఆదుకునేందుకు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర పెట్టి కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో అనంతపూర్‌, బుద్దారం, చాకల్‌పల్లి, గోపాల్‌పేట, జయన్నతిరుమలాపూర్‌, మున్ననూర్‌, పొల్కెపహాడ్‌, తాడిపర్తి, ఏదుట్ల, ఏదుల, లక్ష్మితండా గ్రామాల్లో, సింగిల్‌విండో ఆధ్వర్యంలో కర్నమయ్యకుంట తండా, చెన్నూరు, ఏదుల, బుద్దారం, గోపాల్‌పేటలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వానకాలంలో సన్నరకం వరి సాగు చేశారు. రైతులు నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటాళుకు ఏ గ్రేడ్‌ రూ.1,888, బీ గ్రేడ్‌ రూ.1,868గా కొనుగోలు చేస్తుంది. ధాన్యం విక్రయించిన డబ్బులు ఒకటి, రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. మండలంలో మొత్తం 13,981 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల అంచనా. ఎంజీకేఎల్‌ఐ నీటి రాకతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. ఆయా గ్రామ మహిళా సంఘాలు, సింగిల్‌విండో సొసైటీ సిబ్బంది కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులు, మహిళా సంఘాలు, కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.