శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 16, 2020 , 03:02:40

ఆనందోత్సహాలతో దీపావళి

ఆనందోత్సహాలతో దీపావళి

పాన్‌గల్‌/వీపనగండ్ల/గోపాల్‌పేట/చిన్నంబావి/కొత్తకోట/శ్రీరంగాపూర్‌/వనపర్తిరూరల్‌/టౌన్‌/ఖిల్లా: వనపర్తి జిల్లాలో దీపావళి సంబురాలను ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లాలోని పాన్‌గల్‌, వీపనగండ్ల, గోపాల్‌పేట, చిన్నంబావి, కొత్తకోట, శ్రీరంగాపూర్‌ మండలాల్లో ప్రజలు శని, ఆదివారం దీపావళి పండుగను భక్తిశ్రద్ధ్దలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఆలయాలకు వెళ్లి, ఇంట్లో పూజలు చేశారు. దీపాలు వెలిగించి హారతులు పట్టారు. ఇండ్ల ముందు దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులు పిల్లలతో కలిసి పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా ఇండ్లల్లో గౌరి నోములు, లక్ష్మీవ్రతాలు చేశారు. వీపనగండ్లలోని గంగమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

సోమవారం గంగమ్మ దేవత (పాముకాటు) జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నంబావి మండలంలోని పెద్దమారూర్‌, పెద్దదగడ, దగడపల్లి, అమ్మాయిపల్లి గ్రామాల్లో శనివారం దీపావళి సందర్భంగా ఇండ్లల్లో ప్రత్యేక పూజలు, నోములు వ్రతాన్ని ఆచరించి ఇష్ట దైవాలకు పూజలు చేశారు. శ్రీరంగాపూర్‌, కొత్తకోట మండలాల్లోని అన్ని గ్రామాల్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకొని శ్రీరంగాపూర్‌ మండలంలోని రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భజనలు, కోలటాలు, గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతం పులకరించింది.

వనపర్తి మండలంలోని పల్లెల్లో కరోనా వైరస్‌ ప్రభావాంతో శనివారం దీపావళి పండుగను పటాకులు లేకుండా సాఫీగా ప్రజలు నిర్వహించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో రెండు రోజుల పాటు దీపావళి పండుగను ప్రజలు జరుపుకున్నారు. ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రేవల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో శని, ఆదివారాలల్లో దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా మండల జెడ్పీటీసీ భీమయ్య, ఎంపీపీ సేనాపతిలు మండల ప్రజలకు దీపావళి శుభాకాక్షలు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి నివాస గృహంలో వారు మంత్రిని కలిసి మిఠాయిలను అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ రఘు, మండలాధ్యక్షులు బాల్‌రాజులు జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.