సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Nov 16, 2020 , 03:02:43

ఏకరూపం సిద్ధం..

ఏకరూపం సిద్ధం..

  •   పంపిణీకి సిద్ధంగా ఉన్న  విద్యార్థుల యూనిఫాం 
  • పాఠశాల ప్రారంభం రోజు అందజేత
  • వనపర్తి జిల్లాలో 518 పాఠశాలలు
  • ఒకటి నుంచి 8వ తరగతి వరకు 
  • 46,200మంది విద్యార్థులు
  • యూనిఫాం స్ట్రిచింగ్‌ కోసం రూ. 46,20,000 ఖర్చు
  • డిసెంబర్‌ మొదటి వారంలో పాఠశాలలు
  •  ప్రారంభించే అవకాశం: డీఈవో 

పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాశాఖ అధికారులు  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో  1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కావల్సిన స్కూల్‌ యూనిఫాంలను  అధికారులు సిద్ధం చేసి ఉంచారు.  జిల్లాలోని 518 పాఠశాలల్లోని 92,400 మంది విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజున యూనిఫాంలను అందజేయనున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫాం క్లాత్‌ ద్వారా ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మొత్తం 92,400 యూనిఫాంలను అందించనున్నారు.   దుస్తులు కుట్టేందుకు జతకు రూ.50 చొప్పునమొత్తం  రూ. 46,20,000  ఖర్చుచేసి యూనిఫాంలను   సిద్ధం చేశారు.

    - వనపర్తి, నమస్తే తెలంగాణ

వనపర్తి, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలు ప్రారంభమయ్యేలోపు కావాల్సిన సదుపాయాలను విద్యాశాఖ ఏర్పాటు చేస్తున్నది. పాఠశాలకు హాజరైన ప్రతి విద్యార్థికీ రెండు జతల చొప్పున యూనిఫాంలను అందజేసేందుకు జిల్లా విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టింది. ఆకర్శణీయమైన, నాణ్యమైన యూనిఫాంలను విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజున సరఫరా చేయనున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వం తరుపున వచ్చిన క్లాత్‌ను టైలర్లకు అప్పగించి తరుగతుల వారీగా విద్యార్థులకు సరిపడేలా కుట్టించారు.  

518 ప్రభుత్వ పాఠశాలలు

వనపర్తి జిల్లాలో 518 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా స్కూల్‌ యూనిఫాంలను అందిస్తుంది. ఈ ఏడాది కూడా ప్రతి విద్యార్థికి కూడా యూనిఫాంలు అందించేందుకు తగిన ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 8వ తరగతి వరకు 46,200 మంది విద్యార్థులు ఉన్నారు. 

92,400 యూనిఫాంలు సిద్ధం

విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలు సిద్ధంగా ఉన్నాయి. ఈమేరకు మండల విద్యాధికారులకు డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన యూనిఫాం క్లాత్‌ నుంచి స్టిచ్చింగ్‌ చేసి విద్యార్థులకు అందించే వరకు పూర్తి బాధ్యత ఎంఈవోలు స్వీకరించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మొత్తం 92,400 యూనిఫాం జతలను అధికారులు సిద్ధం చేశారు. బాలికలకు, బాలురకు తరగతుల వారీగా కొలతలు నిర్ణయించి విద్యార్థులకు సరిపడా సైజులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో యూనిఫాంను స్టిచ్చింగ్‌ చేసేందుకు ప్రభుత్వం రూ.50ను ఖర్చు చేసింది. విద్యార్థులందరి కోసం మొత్తం రూ.46,20,000లను ఖర్చుచేశారు. 

పాఠశాల ప్రారంభం రోజున అందిస్తాం..

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా యూనిఫాంలు, సరైన సమయంలో అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాం. పాఠశాల ప్రారంభం రోజునే వాటిని విద్యార్థులకు అందించేందుకు సిద్ధమవుతున్నాము.  డిసెంబర్‌ మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభించే అవకాశం ఉన్నది. మండలాల వారీగా యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసి స్టిచ్చింగ్‌ చేయించాము. మొత్తం 46,200 మంది విద్యార్థులకు 92,400 యూనిఫాంలు సిద్ధంచేసి ఉంచాము. విద్యార్థులకు సరిపడా సైజులో సౌకర్యంగా ఉండేలా తయారు చేయించాం.

- సుశీంధర్‌ రావు, డీఈవో