శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Nov 10, 2020 , 00:14:33

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేస్తున్నాం..

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేస్తున్నాం..

  • రూ 24లక్షలతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన 
  • జిల్లాలో 71 రైతు వేదికలు పూర్తి 
  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి : అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసినట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు. సోమవారం ఆమె వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌తో కలిసి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాన్‌గల్‌ రహదారిలో పట్టణ ప్రగతి నిధుల నుంచి రూ.24లక్షలతో నిర్మిస్తున్న మురుగు కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలో రహదారి విస్తరణతో పాటు, అనేక కార్యక్రమాలను చేపట్టామని, త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు వెసలుబాటు కల్పించనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అంతేకాక జిల్లాలో చేపట్టిన 71 రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయని, ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాక పల్లెప్రకృతి వనాలు, చెత్తను వేరు చేసే షెడ్డులను, వైకుంఠధామాలను నిర్మించామని, ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధుల ద్వారా చేపట్టిన మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేస్తామన్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా పాన్‌గల్‌ రహదారితోపాటు ఇతర రహదారుల వెంట ఉన్న గృహాలను తొలగించి రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు భువనేశ్వరి, రవి, సత్యం, నాగన్నయాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు.