ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Nov 07, 2020 , 05:25:05

నాణ్యమైన ధాన్యంపై అవగాహన ఉండాలి

నాణ్యమైన ధాన్యంపై అవగాహన ఉండాలి

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి రూరల్‌ : వరికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులు పొందేందుకు నాణ్యమైన ధాన్యంపై నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌జీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో వరి ధాన్యం నాణ్యతపై ఐకేపీ, మెప్మా, వ్యవసాయ, మార్కెట్‌ కమిటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా పాటించాల్సిన ప్రమాణాలపై కలెక్టర్‌ పలు సూచనలను చేశారు.

ముఖ్యంగా ధాన్యం  తాలు లేకుండా ఎలాంటి చెత్తా చెదారం తేమలేకుండా ఉండాలన్నారు. ఈ విషయంపై రైతులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ శిక్షణ సందర్భంగా వరిలో గ్రేడ్‌, ఏ, సాధారణ రకాలను గుర్తించడం, తదితర విషయాలపై కలెక్టర్‌ కూలంకషంగా వివరించారు. అంతేకాక ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేసే విధానం, జాప్యం లేకుండా ఆన్‌లైన్‌ నమోదు చేయటం వంటి అన్ని అంశాలపై సూచనలను చేశారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, పౌర సరఫరాల శాఖ ఇన్‌చార్జి జిల్లా మేనేజర్‌ అనిల్‌, పౌర సరఫరాల అధికారి రేవతి, డీఆర్డీవో కోదండరాములు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి స్వర్ణసింగ్‌, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.