శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 06, 2020 , 04:00:24

ధరణితో మెరుగైన సేవలు

ధరణితో మెరుగైన సేవలు

  • మీసేవలో దరఖాస్తు తప్పనిసరి..
  •  సేల్‌, గిఫ్ట్‌ డీడ్‌, విరాసత్‌, కుటుంబ పంపకాల రిజిస్ట్రేషన్లు
  •  సరైన పత్రాలతో అరగంటలోనే ప్రక్రియ పూర్తి
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

వనపర్తి నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, సేల్‌, గిఫ్డ్‌ డీడ్‌, విరాసత్‌, కుటుంబ పంపకం వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. పాత పాస్‌బుక్కులు ఉండి.., కొత్తగా భూమి కొని రిజిస్ట్రేషన్‌ చేసిన వారికి పాత పుస్తకంలోనే వివరాలు నమోదు చేసి ఇస్తున్నారు. ఒకవేళ ఎలాంటి భూమి లేకుండా కొత్తగా కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ చేసి.., కొత్త పాస్‌బుక్కును పోస్ట్‌లో ఇంటికి పంపించనున్నారు. ఇలాంటి వారికి రిజిస్ట్రేషన్‌ చేసినట్లుగా పత్రాలను ఇస్తున్నారు. ధరణి సేవలు వినియోగించుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏఏ రిజిస్ట్రేషన్ల కోసం ఎలాంటి ప్రతాలు తీసుకెళ్లాలి..? ఎక్కడ నమోదు చేసుకోవాలి..? తాసిల్దార్‌ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లాలి..? వంటి విషయాలను ప్రభుత్వం స్పష్టంగా సూచించింది. అవేంటో తెలుసుకుందాం..

సేల్‌, గిఫ్ట్‌ డీడ్‌ కోసం..

భూమిని కొనుగోలు చేసిన వారు లేదా గిఫ్డ్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకున్న వారు ముందుగా మీసేవ కేంద్రంలో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో సూచించిన తేదీన తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లాలి. అమ్మిన వారి పట్టా పాస్‌పుస్తకం, అమ్మిన వ్యక్తి, వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, కొన్న వ్యక్తి, వారి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఇద్దరు సాక్షులు, కొన్న, అమ్మిన వారి పాన్‌కార్డులు, పాన్‌కార్డు లేకపోతే ఫారం-61ను వెంట తీసుకెళ్లాలి. ఈ వివరాలన్నింటినీ పరిశీలించి తాసిల్దార్‌ ధరణి పోర్టల్‌ ద్వారా అత్యంత సులభంగా అరగంటలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ చేసినట్లు పత్రాలు అందజేస్తారు.

విరాసత్‌ కోసం..

వంశపారంపర్యంగా వస్తున్న భూములను, తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించాల్సిన భూములను విరాసత్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇందుకుగానూ పట్టాదారు పాసుపుస్తకంతోపాటు తప్పనిసరిగా పట్టాదారు మరణించినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి. మీసేవలలో దరఖాస్తు చేసుకొని ఇచ్చిన తేదీన తాసిల్దార్‌ కార్యాలయానికి కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, సంతకాలు సేకరించి తీసుకెళ్లాలి. ఇద్దరు సాక్షులు, కుటుంబసభ్యుల ఆధార్‌ కార్డులను కూడా సమర్పించాల్సి ఉంటుంది. తాసిల్దార్‌ వాటినన్నింటిని పరిశీలించి విరాసత్‌ చేస్తారు.

కుటుంబ పంపకం..

కుటుంబ పెద్దకు చెందిన ఆస్తిని కుటుంబంలోని సభ్యులందరికీ పంపకాలు జరిపి రిజిస్ట్రేష న్‌ చేస్తారు. మీ సేవలో దరఖాస్తు చేసుకొని సూ చించిన తేదీన తాసిల్దార్‌ కార్యాలయానికి వె ళ్లాలి. పట్టాదారు పాసుపుస్తకంతోపాటు ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, అంగీకార పత్రం, ఇద్దరు సాక్షులు, వారి ఆధార్‌ కార్డులను తీసుకెళ్లాలి. తాసిల్దార్‌ పరిశీలించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు.