మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Nov 02, 2020 , 02:38:00

నిర్మాణాలు నాణ్యతగా చేపట్టాలి

నిర్మాణాలు నాణ్యతగా చేపట్టాలి

  •  నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
  •  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
  • వనపర్తిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం,  డ్రైనేజీ, దుకాణాల నిర్మాణ పనుల పరిశీలన  
  •  జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ 
  • పనులు నాణ్యతగా చేపట్టాలని అధికారులను వ్యవసాయశాఖ

 మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం వనపర్తిలోని పాన్‌గల్‌ రోడ్డుకు సమీపంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయ భవనం, డ్రైనేజీ నిర్మాణం, నూతన షాపుల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం బాధితులకు సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని సూచించారు.  కేఎల్‌ఐ రైతులకు సాగునీటికి ఢోకా లేదని, వరి, వేరుశనగ సాగు చేసుకోవచ్చని  సూచించారు. 

  వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ పనులు నాణ్యతగా చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాన్‌గల్‌ రోడ్డుకు సమీపంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయ భవనం, డ్రైనేజీ నిర్మాణం, నూతన షాపుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. వాటర్‌ క్యూరింగ్‌ సరిగ్గా చేయాలన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు కోల్పోయిన వారికి డ్రైనేజీ వెనుక భాగంలోని స్థలంలో మున్సిపాలిటీ నుంచి లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా చూడాలని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూర్చాలని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌కు సూచించారు. 

సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

జిల్లా కేంద్రంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆరుగురు బాధితులకు సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కులను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. వనపర్తికి చెందిన యాదగిరి రూ.25 వేలు, జగత్‌పల్లికి చెందిన అనంతమ్మ రూ.60 వేలు, చిన్నమందడికి చెందిన రాజేశ్వరి రూ.15 వేలు, తాడిపర్తికి చెందిన అకాష్‌ రూ.15 వేలు, హుస్సేన్‌పల్లికి చెందిన వెంకటేశ్‌ రూ.22,500, తోమాలపల్లికి చెందిన రాములమ్మ రూ.60 వేలు విలువైన సహాయ నిధి చెక్కులను అందుకున్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, ఏఈ భాస్కర్‌, కౌన్సిలర్లు సత్యం, లక్ష్మీనారాయణ, బల్దియా కోఆప్షన్‌ సభ్యుడు గులాం ఖాదర్‌, మాజీ కౌన్సిలర్లు రమేశ్‌, తిరుమల్‌, నాయకులు రవికుమార్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

కేఎల్‌ఐ రైతులకు సాగునీటికి ఢోకా లేదు 

కేఎల్‌ఐ రైతులకు సాగునీటికి ఢోకా లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా రైతులకు సూచించారు. ఎలాంటి అపోహలకు గురికాకుండా రైతులు వరి నాటుకోవచ్చని, వేరుశనగ కూడా విత్తుకోవచ్చని చెప్పారు. ఎంజీకేఎల్‌ నీటి పంపింగ్‌ సమస్య త్వరలో తీరిపోతుందని తెలిపారు. ఈనెల 20 వరకు మోటర్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని సమస్యలు సర్దుకుంటాయని, యాసంగి పంటలకు సరిపడా నీటిని అందిస్తామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. 

దవాఖాన ప్రారంభించిన మంత్రి 

 కొత్తకోట: పట్టణంలోని సరోజిని దవాఖానను ఆదివారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర, అలంపూర్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, బాజిరెడ్డి గోవర్ధ్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. డాక్టర్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ దవాఖానలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాలనారాయణ, ఎంపీపీ గుంత మౌనిక, నాయకులు విశ్వేశ్వర్‌, రంగారెడ్డి, గౌని బుచ్చారెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, భీంరెడ్డి పాల్గొన్నారు.