గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Oct 30, 2020 , 02:04:31

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో అమలులోకి వచ్చిన రెవెన్యూ చట్టం

ధరణి పోర్టల్‌ ప్రారంభంతో అమలులోకి వచ్చిన రెవెన్యూ చట్టం

  • కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తి : ధరణి పోర్టల్‌ ప్రారంభంతో గురువారం నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చిందని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. అదేవిధంగా తాసిల్దార్లు అదనపు సబ్‌ రిజిస్ట్రార్లుగా వ్యవహరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గురువారం సీఎం కేసీఆర్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తన చాంబర్లో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి సీఎం ప్రసంగాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ వనపర్తి తాసిల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పోర్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూములకు సంబంధించిన వివరాలకు ధరణి పోర్టల్‌ పారదర్శకమైన చక్కటి విధానమన్నారు.

భూములకు సంబంధించిన వివరాలను ఎవరైనా, ఎక్కడి నుంచెనా ధరణి పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చనన్నారు. ముఖ్యంగా ఈ పోర్టల్‌ ద్వారా ఒకే రోజు భూమి రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ అయిపోయిన వెంటనే ఆటోమెటిక్‌గా రెవెన్యూ రికార్డుల్లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తారన్నారు. వనపర్తిలోని అన్ని తాసిల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ పారదర్శకంగా పని చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలకు ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చినందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, తాసిల్దార్‌ రాజేంద్రగౌడ్‌ పాల్గొన్నారు.