బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Oct 28, 2020 , 00:36:11

దీపావళికి ముందే గృహప్రవేశాలు

దీపావళికి ముందే గృహప్రవేశాలు

  • మేము మాటలు చెప్పం.. చేతల్లో చూపిస్తాం 
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  • దివిటిపల్లిలో డబుల్‌బెడ్రూం ఇండ్లు పరిశీలన

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని.. చేతల్లో చేసి చూపించే సర్కారు అని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి గ్రామ సమీపంలోని డబుల్‌బెడ్రూం ఇండ్ల వద్ద జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఐటీ పార్కు పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిచేందుకు త్వరలోనే మరో అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరుకు తీసుకొస్తామని, ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రకటిస్తారని తెలిపారు. దివిటిపల్లి వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలు దీపావళికి వారం రోజుల ముందే చేయిస్తామని తెలిపారు. 

మహబూబ్‌నగర్‌ నలువైపులా డబుల్‌ ఇండ్లు నిర్మించి పేదలకు అండగా ఉంటున్నామని చెప్పారు. అయితే దివిటిపల్లి భూమి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకోవాలన్నారు. 15 ఏండ్ల కిందటే అప్పటి ప్రభుత్వ హయంలోనే భూ కేటాయింపు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గంలోనే రూ.400 కోట్ల విలువచేసే డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని, దివిటిపల్లి వద్ద 1,024 ఇండ్లు నిర్మించామని చెప్పారు. వైద్యకళాశాల ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ 44వ జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్న దివిటిపల్లి డబుల్‌ ఇల్ల్లు ఏరియాకు మార్కెట్‌ పరంగా విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందన్నారు.  దివిటిపల్లి ఇండ్లను గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. 

ఎవరైనా ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్‌ చేస్తే వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని మంత్రి సూచించారు. 70ఏండ్లుగా పేదవాడికి ఏ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, దివిటిపల్లి సర్పంచ్‌ జరీనాబేగం, ఎంపీపీ సుధారాణి, వైస్‌ ఎంపీపీ అనిత, కౌన్సిలర్‌ యాదమ్మ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, నాయకులు శేఖర్‌, పాండురంగారెడ్డి, ముకుర్రంజ, శేఖర్‌  పాల్గొన్నారు. 

ఆలయాన్ని పునర్‌నిర్మించండి

మహబూబ్‌నగర్‌ తెలంగాణచౌరస్తా: మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ద సాధువుల గుట్టలో ఉన్న వేంకటేశ్వరస్వామి , ఆంజనేయస్వామి దేవాలయాలను పునర్‌ నిర్మించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో దేవాలయ కమిటీ సభ్యుడు రాయికంటి ఈశ్వర్‌ మంత్రిని కలిసి విన్నవించడంతో సానుకూలంగా స్పం దించారు. ఈసందర్భంగా దేవాలయం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాయికంటి ఈశ్వర్‌స్వామి, సెక్రటరీ కట్టా నర్సిములు, యాదవ్‌, అర్చకులు సిద్ధేశ్వర్‌, ఆలయ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. 

వెయ్యికోట్ల పెట్టుబడులు సిద్ధం

జిల్లాకు మరో భారీ పరిశ్రమ

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ టౌన్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాను ఇటు సాగునీటి రంగంలో అటు సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఇక్కడ వెయ్యికోట్లతో పరిశ్రమలు నెలకొల్పేందుకు వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉన్నారని మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.  సీఎం కేసీఆర్‌,ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పాలమూరుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు.  మంగళవారం మంత్రి కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి మహబూబ్‌నగర్‌ సమీపంలో దివిటిపల్లి ఐటీ కారిడార్‌ వద్ద నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లోని ఐటీ మల్టీపర్పస్‌ ఇండస్ట్రీ కారిడార్‌కోసం ఇప్పటికే భూసేకరణకు రూ.50కోట్లు కేటాయించగా, మరో రూ.50కోట్లతో పరిశ్రమల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం 500 ఎకరాలు  సేకరించామని, అవసరమైతే మరిన్ని ఎకరాలు సేకరించి కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తామన్నారు. రానున్న రోజుల్లో లక్షమందికి  ఉద్యోగ,ఉపాధి అవకాశాలు  రానున్నాయన్నారు.  

తొందరలోనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాలమూరుకు రానున్నారని, మరో భారీ పరిశ్రమను ప్రకటించనున్నారన్నారు.  కుల,మత పిచ్చి తమకు లేదని, కేవలం అభివృద్ధి పిచ్చి ఉందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌,  గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, దివిటిపల్లి సర్పంచ్‌ జరీనాబేగం, ఎంపీపీ సుధారాణి, వైస్‌ ఎంపీపీ అనిత, కౌన్సిలర్‌ యాదమ్మ, మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌, నాయకులు శేఖర్‌, పాండురంగారెడ్డి, ముకుర్రంజ, శేఖర్‌, హన్మంతు, రాములు, నవకాంత్‌, అమర్‌, శ్రీను, బాల్‌రెడ్డి, కారిడార్‌ జోనల్‌ మేనేజర్‌ రాజ్‌కుమార్‌, అర్బన్‌ తాసిల్దార్‌ పార్థసారథి, డీటీలు రాజగోపాల్‌, క్రాంతికుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.