మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Oct 22, 2020 , 00:06:50

ఇవి పాలేనా..?

ఇవి పాలేనా..?

  • బహిరంగ ప్రదేశాల్లో పాల అమ్మకాలు
  • నాణ్యత పరీక్షించే పరికరాలేవీ..?
  • కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు సమాచారం
  • తూతూమంత్రంగా అధికారుల పర్యవేక్షణ

నడిగడ్డ : అక్రమానికి కాదేదీ అనర్హం..! అన్నట్లుగా పాలను కూడా కల్తీ చేస్తున్నారు.. యూరియా, ఉప్పు, చక్కర, ఆయిల్‌తో తయారు చేసిన పాలను విక్రయిస్తున్నారు.. దీనికి తోడు పాలనాణ్యత, స్వచ్ఛతను పరీక్షించే పరికరాలు లేకపోవడం.. అమ్మే వాళ్ల మధ్య పోటీ పెరగడంతో.. ధనార్జనే ధ్యేయం గా ఎక్కడపడితే అక్కడ పాలను విక్రయిస్తున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళీ పడినా పట్టించుకునే వారులేరు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎక్కడ పడితే అక్కడ పాలను విక్రయిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు కల్తీ పాలు అమ్ముతున్నారు. వారికి కనీసం ఏ కంపెనీకి చెందిన డెయిరీలతో సంబంధం ఉండదు. 

అంతేకాకుండా పాలు ఎక్కడి నుండి తెస్తున్నారో కూడా సమాధానమివ్వరు.. అమ్మే వాళ్ల మధ్య పోటీ ఉండటంతో కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉదయం మిగిలిన పాలను రాత్రి పాలల్లో కలిపి విక్రయిస్తున్నారు. వీటిని తాగిన ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓసారి అధికారులు కల్తీ పాలను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకుని వెళ్లి పరీక్షించారు. నమూనాలు తీసుకెళ్లారు. అయినా లాభం లేదు.. మళ్లీ కథ మొదటికే.. దర్జాగా ఇష్టానుసారంగా మళ్లీ వారు పాలు అమ్ముతున్నారు. 

పాలు విక్రయించే బహిరంగ ప్రదేశాలు..

గద్వాలలో ఎనిమిది కేంద్రాల్లో మాత్రమే నాణ్యత, స్వచ్ఛతను పరీక్షించే పరికరాలు ఉ న్నాయి. వారికి పెద్ద పెద్ద డెయిరీలతో సంబంధం ఉండి పాలు విక్రయిస్తుంటారు. వీరితో ఎ లాంటి సమస్య లేదు. ఉండేదంతా ఎలాంటి పరికరాలు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో పాలను విక్రయించే వాళ్లతోనే.. ముఖ్యంగా కృష్ణవేణి చౌరస్తా, గాంధీ చౌక్‌, కిష్టారెడ్డి బంగ్లా, పాత బస్టాండ్‌, సెకండ్‌ రైల్వేగేటు, గంజిపేట కాలనీ, చింతలపేట, సాయి హోమ్స్‌, న్యూ హౌసింగ్‌ బోర్డు, ఓల్డ్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలతో పాటు మరికొన్ని బహిరంగ ప్రదేశాల్లో పా లు అమ్ముతున్నారు. వారు పాలు ఎక్కడి నుంచి తెస్తున్నారో సమాధానం చెప్పరు. రోడ్లపై దుమ్ము, ధూళీ పడుతున్నా.. వారికి డబ్బు కావాలి కనుక అలాగే పాలు అమ్ముతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.