సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 21, 2020 , 01:56:23

మెరువనున్న వేరుశనగ

మెరువనున్న  వేరుశనగ

  • యాసంగిలో పల్లీకి రైతన్న మొగ్గు   
  • రాష్ట్రంలోనే కందనూలుకు ప్రాధాన్యత
  • 1.33 లక్షల ఎకరాల్లో సాగు అంచనా  
  • వనపర్తి జిల్లాలో 49 వేల ఎకరాల్లో..
  • ఉమ్మడి జిల్లాలో 4.89 లక్షల ఎకరాల్లో వరి  
  • యాసంగి పంట ప్రణాళిక ఖరారు

ఉమ్మడి జిల్లా యాసంగి పంటల సాగు ప్రణాళిక ఖరారైంది. పల్లీ పంట సాగుకు రైతన్న మొగ్గు చూపనున్నారు.  ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో వరి, వేరుశ నగ, శనగలు ప్రధాన పంటలుగా సాగు కానున్నాయి. ఇందులో వేరుశనగ రాష్ట్ర వ్యాప్తంగా 3.99 లక్షల ఎకరాల్లో సాగుకానున్నట్లు ప్రభుత్వం అంచనా వేయగా.. ఇందులో 1.33 లక్షలతో నాగర్‌కర్నూల్‌  జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవబోతుండటం విశేషం. ఇక వనపర్తి జిల్లా సైతం 49 వేల ఎకరాలతో రెండో స్థానంలో నిలవనున్నట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొన్నది. అలాగే ఉమ్మడి జిల్లాలో 4.89 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నదని అంచనా.. ఇది పంటల సాగులో పాలమూరు పురోభివృద్ధిని సూచిస్తున్నది.

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : యాసంగి సాగు ప్రణాళిక ఖరారైంది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో వరితోపాటు శనగ, వేరుశనగలను ప్రధాన పంటలుగా సాగు చేయనున్నారు. ఏఈవోల ద్వారా గ్రామ స్థాయి నుంచి రైతులు సాగు చేసే పంటల వివరాలు సేకరించారు. ఈ సమాచారంతో ప్రభుత్వం పంటల అంచనాను విడుదల చేసింది. దీని ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వేరుశనగలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 3,99,680 ఎకరాల్లో వేరుశనగ సాగు అంచనా ఉండగా, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 1,33,110 ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా. గత సీజన్‌లో జిల్లాలో 96,092 ఎకరాలు అంచనా వేయగా.., 1,17,837 ఎకరాల్లో సాగు చేశారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి 15,273 ఎకరాలు అత్యధికంగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమైనట్లు వ్యవసాయ శాఖ అంచనా. 

వనపర్తి జిల్లా 49,984 ఎకరాలతో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 2,34,182 ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నట్లు అంచనా. ఎంజీకేఎల్‌ఐతో నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో సాగునీటి వనరులు పెరిగాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. 90 శాతానికి పైగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీనివల్ల రానున్న యాసంగి సీజన్‌లో నీటి కష్టాలు తీరాయి. గత ఐదేండ్లుగా ఇవే పరిస్థితులు ఉండటంతో వేరుశనగతోపాటు వరి కూడా అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో ఉమ్మడి పాలమూరులో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటగా వరి నిలవనున్నది. 4,98,261 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. వనపర్తి జిల్లా 1.44 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా.., 1,07,223 ఎకరాలతో నాగర్‌కర్నూల్‌, 1,07,404 ఎకరాలతో మహబూబ్‌నగర్‌ జిల్లాలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. 

మూడో ప్రధాన పంట అయిన శనగలు 27 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. జోగుళాంబ గద్వాల 20,654 ఎకరాలతో ఈ పంటల సాగులో ముందంజలో ఉండగా కేవలం 89 ఎకరాల స్వల్ప సాగుతో మహబూబ్‌నగర్‌ చివరి స్థానంలో నిలిచింది. యాసంగి సాగు ప్రణాళిక ఖరారు చేయడంతో వ్యవసాయ శాఖకు తదుపరి చేపట్టే చర్యలు సులువు కానున్నాయి. రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రస్తుతం వానకాలంలో సాగు చేసిన వరి, పత్తి కొనుగోళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. 

త్వరలో అవగాహన.. 

జిల్లాలో సాగునీటి వనరులు పెరిగాయి. ఎంజీకేఎల్‌ఐతో భూగర్భ జలం పెరిగింది. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. రైతులు ఈ సీజన్‌లో వేరుశనగ పంటకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్‌ జిల్లా మొదటి స్థానంలో నిలవనున్నది. వర్షాలు తగ్గిన తర్వాత రైతులకు వేరుశనగ సాగుపై అవగాహన కల్పిస్తాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటాం.

- వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్‌