మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Oct 21, 2020 , 01:56:26

శరవేగంగా బయటకు..

శరవేగంగా బయటకు..

  • 320 హెచ్‌పీ సామర్థ్యంగల  ఆరు మోటర్లతో నిర్విరామంగా..
  • ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌ వద్ద  కొనసాగుతున్న నీటి తోడివేత
  • మరో మోటర్‌ బిగింపు పనులు
  • ఇప్పటికే 9 ఫీట్ల నీరు బయటకు..
  • పంప్‌హౌస్‌ వద్దే ఇంజినీర్ల తిష్ట
  • నిర్విరామంగా ఎంజీకేఎల్‌ఐ మొదటిలిఫ్ట్‌ పంప్‌హౌస్‌ వద్ద నీటి తోడివేత

కొల్లాపూర్‌ : ఎల్లూరు సమీపంలోని మునకకు గురైన ఎంజీకేఎల్‌ఐ పంప్‌హౌస్‌ నుంచి నీటి తోడివేత కొనసాగుతున్నది. భారీ మోటర్లను వినియోగించి మంగళవారం సాయంత్రం వరకు 9 ఫీట్ల నీటిని బయటకు పంపించారు. రేయింబవళ్లు ఇంజినీర్లు అక్కడే తిష్టవేసి నీటి తొలగింపునకు శ్రమిస్తున్నారు. ఈనెల 16న ఎంజీకేఎల్‌ఐ మొదటి లిఫ్ట్‌లో పంప్‌హౌస్‌లోని మూడో మోటర్‌లోని సాఫ్ట్‌సీల్‌ అనే పరికరం ఎగిరిపోయి అకస్మాత్తుగా నీరు చేరి పంప్‌హౌస్‌ మునిగిపోయిన విషయం తెలిసిందే.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు వివిధ ప్రాజెక్టుల నుంచి మొత్తం ఆరు మోటర్లను ఏర్పాటు చేసి నీటిని తోడివేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 8 ఫీట్లు, సాయంత్రం 5 గంటలకు 9 ఫీట్ల నీటిని బయటకు పంపించారు.

అయితే ప్రస్తుతం 75 హెచ్‌పీ పంప్‌ మోటర్లు రెండు,100 హెచ్‌పీ మోటర్‌ ఒకటి, 40 హెచ్‌పీ మోటర్లు రెండు, 30 హెచ్‌పీ ఒక మోటర్‌ కలిపి మొత్తం ఆరు మోటర్ల ద్వారా 320 హెచ్‌పీని వినియోగించి తోడివేత సహాయక పనులకు శరవేగంగా కొనసాగిస్తున్నారు. అయితే మరో 150 హెచ్‌పీ పంప్‌ మోటర్‌ను కూడా అమర్చే పనులు కొనసాగాయి. పంప్‌హౌస్‌లో వేగంగా నీటిమట్టం తగ్గుతుండటంతో ఇటు ప్రాజెక్టు అధికారులు.. అటు ప్రజాప్రతినిధులు, రైతులకు ఊరట కలుగుతున్నది. ప్రాజెక్టు పరిసరాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నది.