బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Oct 20, 2020 , 01:38:01

వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వే చివరి దశకు

 వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వే చివరి దశకు

  • వనపర్తి జిల్లాలో 91.01 శాతం సర్వే పూర్తి 

వనపర్తి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల సర్వే చివరి దశకు చేరుకున్నది. ప్రతి ఒక్కరి ఆస్తుల వివరాలను ఉచితంగా నమోదు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీన సర్వే ప్రారంభమైంది. వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో వ్యసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. ఈ నెల 20వ తేదీన గడువు ముగియనుండటంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. మరోవైపు సాంకేతిక సమస్యలు, ఇంటి యజమానులు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.


గతంలో అసెస్‌ చేసిన దానితో పాటు ఇంతవరకు రికార్డుల్లోకి ఎక్కని వివరాలను సైతం అధికారులు సేకరిస్తున్నారు. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆస్తుల వివరాలన్నింటినీ ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తున్నారు. దాదాపు 30 అంశాల సమాచారం తీసుకుంటున్నారు. గత అసెస్‌మెంట్‌, స్థలం, నివాసం, ఆధార్‌, మొబైల్‌, సామాజిక వర్గం, కరెంట్‌ మీటర్‌ నంబర్‌, రేషన్‌కార్డు, చిరునామా తదితర వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో 36,011 ఇండ్లు ఉండగా, ఇప్పటివరకు 32,774 ఇండ్ల నుంచి వివరాలు సేకరించారు. దీంతో 91.01 శాతం సర్వే పూర్తి అయ్యింది. 

నేటితో ఆన్‌లైన్‌ పూర్తి..


వ్యవసాయేతర ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌ నేటితో పూర్తి చేస్తాం. వనపర్తి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటి వివరాలు సేకరించాం. ఇప్పటికే  వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ 91 శాతం పూర్తైంది. ఇంకా 9 శాతం మిగిలి ఉంది. అది కూడా నేటితో పూర్తి అవుతుంది.

- గట్టుయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వనపర్తి