శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Oct 17, 2020 , 04:30:59

ట్రాక్టర్లు.. ఆర్థిక వనరులు

ట్రాక్టర్లు.. ఆర్థిక వనరులు

  • వనపర్తి జిల్లాలో 233 ట్రాక్టర్ల పంపిణీ 
  • ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం సబ్సిడీ
  • బీసీ, ఓసీలకు 50 శాతం రాయితీ 

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం అందజేసిన సబ్సిడీ ట్రాక్టర్లు యువతకు ఆర్థిక వనరులుగా మారాయి. లాభార్జనే ధ్యేయంగా ప్రభుత్వం యువతకు సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేసింది. 2016-17లో వనపర్తి జిల్లాలో మొత్తం 233 ట్రాక్టర్లను అందజేశారు. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, బీసీ, ఓసీలకు 50 శాతం రాయితీ ఇచ్చింది. ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి రూ.7.07 కోట్లను సబ్సిడీకి కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నార్మల్‌ స్టేట్‌ ప్లాన్‌, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ట్రాక్టర్లను అందించారు. నార్మల్‌ స్టేట్‌ ప్లాన్‌లో ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, బీసీ, ఓసీలకు 50 శాతం సబ్సిడీని కేటాయించి ట్రాక్టర్లను అందించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకంలో అన్ని కేటగిరీల వారికి 50 శాతం సబ్సిడీ కింద ట్రాక్టర్లను అందించారు. 

జిల్లాలో 233 ట్రాక్టర్లు..

కేంద్ర, రాష్ట్ర పథకాల కింద జిల్లాలో 233 ట్రాక్టర్లను అందించారు. నార్మల్‌ స్టేట్‌ ప్లాన్‌ ద్వారా 178 ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఇందులో బీసీ, ఓసీలకు 151, ఎస్సీలకు 13, ఎస్టీలకు 14 ట్రాక్టర్లను అందించారు. బీసీ, ఓసీలకు సబ్సిడీ ద్వారా రూ.5.28 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1.79 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన్‌ పథకం ద్వారా 55 ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీతో అందించారు. 

రెండింతల ఆదాయం..


2017లో ప్రభుత్వం అందించిన సాయంతో సబ్సిడీలో ట్రాక్టర్‌ తీసుకున్నాను. నాకున్న ఐదెకరాల భూమి సాగు చేసుకుంటున్నాను. అలాగే ట్రాక్టర్‌తో ఇతరుల భూమిని కూడా సాగు చేయడంతో రెండింతల ఆదాయాన్ని సంపాందిస్తున్నాను. గ్రామంలోని ఇతర అవసరాలకు కూడా ట్రాక్టర్‌ వినియోగిస్తున్నాను. నా జీవితానికి ప్రభుత్వం చక్కటి మార్గాన్ని కల్పించింది. 

- రమేశ్‌, రైతు, పెద్దగూడెం, వనపర్తి మండలం