సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Oct 07, 2020 , 00:58:01

యసంగి ఖరారు

యసంగి ఖరారు

  • పంటల సాగు ప్రణాళికలు సిద్ధం
  • గద్వాల జిల్లాలో 40,155 హెక్టార్లలో అంచనా
  • గతేడాది 35,935 హెక్టార్లలో..
  • నీటి వసతికి అనుగుణంగా సాగు
  • సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
  •  వానకాలం సాగు సీజన్‌ పూర్తి కావస్తుండటంతో అధికారులు 

యాసంగిపై దృష్టి సారిస్తున్నారు. ఈనెలలోనే సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో పంటల సాగు ప్రణాళికను ఖరారు చేశారు. 40,155 హెక్టార్లలో అంచనా వేశారు. గతేడాది 35,935 హెక్టార్లలో సాగవగా.. ఈ సారి నీటి వసతికి అనుగుణంగా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. అవసరానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న వినూత్న పథకాలు, పుష్కలంగా సాగునీరు అందేలా చేపట్టిన ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వల్ల సాగు పెరుగుతున్నదని చెబుతున్నారు. గతంలో రైతులు పంటలు సాగు చేసినప్పటి నుంచి మార్కెట్‌లో ధాన్యం విక్రయించే వరకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు చేపడుతున్నది. దీంతో రైతులకు గతంలో ఎదురైన సమస్యలు ఏ ఒక్కటి కూడా తలెత్తడంలేదు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసే విధంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తున్నది. పంటల సాగుకు కావాల్సిన వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై ట్రాక్టర్లు, హార్వెస్టర్లనూ ప్రభుత్వం అందిస్తున్నది.

   ముందస్తుగానే ప్రణాళిక

వ్యవసాయాధికారులు యాసంగి సాగుకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేస్తున్నారు. పంట సమయం నాటికి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎంత పంటను రైతులు సాగు చేయనున్నారు..? ఏ ఏ పంట సాగుచేయనున్నారు..? ఇందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఏ మేరకు అవసరమవుతాయని అంచనాలు వేస్తున్నారు. యాసంగి సాగు ప్రారంభమయ్యే నాటికి రైతులకు అందాల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులను, కావాల్సిన పెట్టుబడి సాయం అందించేందుకు ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టారు. ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే రైతులకు సరిపడినంతా దిగుమతి చేసుకొనేలా చర్యలు చేపడుతున్నారు. 

   40,155 హెక్టార్లలో..

యాసంగింలో గతేడాది కన్న 10 నుంచి 20శాతం వరకు సాగు పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది యాసంగిలో 35,935 హెక్టార్లలో పంటలు సాగు చేయగా ఈ సారి 40,155హెక్టార్లలో పంటలను సాగుచేయవచ్చని అంచనా వేస్తున్నారు. జిల్లాలో యాసంగిలో సాధారణ విస్తీర్ణం 42,916 హెక్టార్లు ఉండగా ఈ సారి 90శాతం భూమి సాగయ్యే అవకాశాలున్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఏడాది కృష్ణ, తుంగభద్ర నదులు పోటెత్తి ప్రవహిచడంతో జిల్లాలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. భారీగా వరద నీరు ప్రాజెక్ట్‌ల్లో, కాల్వల్లో, చెరువుల్లో, కుంటల్లో నిల్వ ఉండటంతో భూగర్భజలాలు పెరుగనున్నాయి. ఈ చర్యలతో యాసంగి పంటలకు కావాల్సినంత సాగునీరు అందనున్నది. ఈ ప్రభావంతో సాధారణ విస్థీర్ణాన్ని మించి యాసంగిలో పంటలు సాగు చేయనున్నారు.

సాగు అంచనా 

యాసంగిలో వరి 8,627 హెక్టార్లు, జొన్న  1770, మక్కజొన్న 1517, కంది 14,565, గ్రీన్‌ గ్రాం 59, బ్లాక్‌ గ్రాం 762, రెడ్‌గ్రాం 57, కౌగ్రాం 258, వామ 264, చెరుకు 322, ఉల్లి 272, వివిధ కూరగాయలు 907 హెక్టార్లు, వేరుశనగ 9,418, పొగాకు 1259, వివిధ  రకాల పంటలు 98 హెక్టార్లుగా భావిస్తున్నారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంచనాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రాథమికంగా మాత్రమే సాగు అంచనా వేస్తున్నారు. 

మండలాల వారీగా సాగు వివరాలు

జిల్లాలో మొత్తం 40,155 హెక్టార్లలో సాగు చేస్తుండగా వీటిలో కేటీదొడ్డిలో 2,765 హెక్టార్లు, ధరూర్‌లో 5,310,  గద్వాలలో 3,485, ఇటిక్యాలలో 3,386, మల్దకల్‌లో 4,442, గట్టులో 4,316, అయిజలో 2,160, రాజోళి  2,122,  వడ్డేపల్లిలో 1,734,  మానవపాడు 1,890, ఉండవల్లిలో 4,045, అలంపూర్‌ మండలంలో 4501 హెక్టార్లలో పంటలు సాగుచేయనున్నారని అంచనా వేస్తున్నారు. 

యాసంగికి అంచనా వేస్తున్నాం

ఈ ఏడాది యాసంగి సాగు పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది కంటే 10 నుంచి 20శాతం సాగు పెరుగనున్నది. యాసంగిలో సాధారణ పంటల విస్తీర్ణం 42,916 హెక్టార్లు ఈ సంఖ్యకు దగ్గరగా సాగు ఉండబోతుందని అంచనా వేస్తున్నాం. ప్రాథమిక స్థాయిలో అంచనా సిద్ధం చేస్తున్నాం. కావాల్సిన ఎరువులు, విత్తనాలు ఏ మేరకు అవసరమవుతాయి, ముందస్తుగా సిద్ధం చేస్తున్నాం. యాసంగి పంటల కాలం నాటికి పూర్తి నివేదికలు తయారుచేసి రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు చేపడుతాం.

-  గోవింద్‌ నాయక్‌, వ్యవసాయశాఖ అధికారి, జోగుళాంబ గద్వాల జిల్లా