సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Sep 27, 2020 , 06:44:26

ఎడతెరిపి లేని వర్షం

ఎడతెరిపి లేని వర్షం

  • జిల్లాలో 55.2మీ.మీ వర్షపాతం నమోదు
  • పొంగిన పలు వాగులు, కుంటలు, చెరువులు
  • పలుచోట్ల  రాకపోకలకు అడ్డంకులు
  • కూలిపోయిన పాత ఇండ్ల మిద్దెలు
  • పరిశీలించిన అధికారులు

వనపర్తి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రి వరకు భారీ వర్షం కురువడంతో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి.. వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేరు, మండలాల్లో పలు కుంటలు, చెరువులు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.. కొన్ని చోట్ల ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. భారీ వర్షానికి కొన్ని పాత ఇండ్లు నెలమట్టామయ్యాయి. ఆయా మండలాల్లోని గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండటంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వర్షం నీటితో పారుతున్న చెరువులను, కుంటలను, వాగులను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.

వనపర్తి, నమస్తేతెలంగాణ: వర్షం మళ్లీ ముంచెత్తుతుంది. వనపర్తి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా 55.2 ఎంఎం వర్షపాతం నమోదైంది. అ త్యధికంగా శ్రీరంగాపురం మండలంలో 67.0 ఎంఎం, అత్యల్పంగా చిన్నంబావి మండలంలో 29.7ఎంఎం వర్షాపాతం నమోదైంది. ఇక మండలాల వారీగా అమరచింతలో 57.5 ఎంఎం, మదనాపురంలో 64.3, పెద్దమందడిలో 66.1, ఘనపురంలో 59.7, గోపాల్‌పేటలో 41.1, రేవల్లిలో 35.8, పాన్‌గల్‌లో 64.8, వనపర్తిలో 56.8, కొత్తకోటలో 44.8, ఆత్మకూరులో 62.7, పెబ్బేరులో 65.1, వీపనగండ్లలో 56.8ఎంఎం చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇంతవరకు జూన్‌లో సాధారణ వర్షపాతం 63.1ఎంఎం కాగా 156.4ఎంఎం వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 150.8 ఎం ఎం కాగా 305.3ఎంఎం వర్షాపాతం నమోదైంది. ఆగస్టులో 123.0ఎంఎం సాధారణ వర్షపాతం కాగా 281.7ఎంఎం వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో ఇంతవరకు సాధారణ వర్షపాతం 88.7ఎంఎం కాగా 313.3ఎంఎం వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో ఇంతవరకు మొత్తం 4నెలల్లో కలిపి సాధారణ వర్షపాతం 425.6 ఎంఎం కాగా ఇంతవరకు 1056.6ఎంఎం వర్షపాతం నమోదైంది. గతేడాది వర్షపాతం మొత్తం సీజన్‌లో దాదాపుగా 500.26ఎంఎం వర్షపాతం నమోదుకాగా ఈసారి అంతకు రెట్టింపుగా నమోదైంది.   

వనపర్తి : జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు వాన కురుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే తమపనులు చేసుకుంటున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురువడంతోపాటు శనివారం సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమైంది. దీంతో రోడ్లన్నీ బురదమయం కావడంతో నిర్మానుష్యంగా మారింది. 

ఆత్మకూరులో..

ఆత్మకూరు : ఆత్మకూరు, అమరచింత మండలాల్లో మళ్లీ వర్షం ముసురుకుంది.  ఆత్మకూరులో శనివారం తెల్లవారే సరికి 63.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. ముఖ్యంగా ఆత్మకూరు, అమరచింతలోని పెద్ద చెరువులు అలుగుపారడం విశేషం. ఉమ్మడి మండల్లాల్లో భారీగా కురిసిన వర్షాలకు చాలా గ్రామాల్లో వరిపంట నీట మునిగింది. అదేవిధంగా వరుస వర్షాల నేపథ్యంలో ఆత్మకూరు మండలం దేవరపల్లిలో మూడు ఇండ్లు, రేచింతల, బాలకిష్టాపూర్‌, జూరాలలో ఒక్కో ఇండ్లు చొప్పున కూలిపోయాయి. అమ


రచింతలో ఐదు ఇండ్లు, మస్తీపూర్‌లో ఒకటి చొప్పున ఇండ్లు కూలిపోయాయి. కూలిన ఇండ్లను తాసిల్దార్‌ జేకే మోహన్‌, సింధుజ, చైర్‌పర్సన్‌ మంగమ్మగౌడ్‌, వైస్‌చైర్మన్‌ గోపి, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పరిశీలించారు.

పెబ్బేరులో..

పెబ్బేరు రూరల్‌ : పెబ్బేరు ఉమ్మడి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెబ్బేరు-వనపర్తి మధ్యన కంచిరావుపల్లి వద్ద చేపలవాగు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు వేరే దారుల గుండా గమ్యస్థానాలకు చేరుకున్నారు. అలాగే, సూగూరు-బున్యాదిపురం గ్రామాల మధ్య లో వాగు పారి కొంతమేరకు రోడ్డు దెబ్బతిన్నది. 

పెద్దమందడిలో..

పెద్దమందడి : మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ముసురు వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో 66.1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అలుగులు పారుతుండడంతో ఆయా గ్రా మాల ప్రజలు ఆన ందాన్ని వ్యక్తం చేస్తున్నారు.