సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Sep 26, 2020 , 01:18:11

ప్రాణాలు తీసిన భూతగాదా

ప్రాణాలు తీసిన భూతగాదా

  • పట్టపగలే కత్తితో దాడి : ఇద్దరు మృతి
  • ప్రతి దాడిలో నిందితుడికి తీవ్ర గాయాలు 
  • వనపర్తి జిల్లా ఏటిగడ్డ శాఖాపూర్‌లో సంఘటన 
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అపూర్వరావు

పొలం పంచాయితీలో రక్తం చిమ్మింది. దాయాదుల మధ్య భూ తగాదాలు తారస్థాయికి చేరాయి. ఇద్దరి హత్యకు దారి తీయగా.. ప్రతి దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌లో పట్టపగలే చోటు చేసుకున్నది. 

పెబ్బేరు రూరల్‌ : పొలం పంచాయితీలో రక్తం చిమ్మింది. దాయాదు ల మధ్య చాలా ఏండ్లుగా నెలకొన్న గట్టు తగాదాలు ఇద్దరి హత్యకు దారి తీయగా.. ప్రతి దాడిలో నిందితుడికి తీవ్ర గాయాలైన సంఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్‌లో పట్టపగలే చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన గువ్వల శాంతయ్యకు అతని దాయాదులకు చాలా కాలంగా భూతగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామంలో గ్రామ పెద్దలు సమస్యను పరిష్కరించేందుకు సమావేశమయ్యారు. అక్కడ దాయాదుల మధ్య మాటా.. మాటా పెరగడంతో పరశురాముడు కత్తితో ప్రత్యర్థి గువ్వల శాంతయ్య (60)పై దాడి చేశాడు. దాడిని అడ్డుకోబోయిన ఆయన సమీప బంధువు రామకృష్ణ అలియాస్‌ పాండు (24)పై కూడా తిరగబడ్డాడు.

తీవ్రంగా గాయపడ్డ వీరిద్దరినీ పెబ్బేరు పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఇద్దరూ మృతి చెందారు. ఊహించని సంఘటనతో ఆగ్రహంతో ప్రత్యర్థులు అక్కడే ఉన్న పరశురాముడుపై ప్రతి దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అపూర్వరావు పరిశీలించి ఘటన తీరును డీఎస్పీ కిరణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట సీఐ మల్లికార్జున్‌రెడ్డి, పెబ్బేరు ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.