బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Sep 24, 2020 , 03:23:05

ప్రకృతి వనానికి భూమి పూజ

ప్రకృతి వనానికి భూమి పూజ

  • కలెక్టర్‌ ఆదేశాలతో.. ఒక్కటైన గ్రామస్తులు

వీపనగండ్ల : కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఆదేశాలతో ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కావాల్సిన స్థలాన్ని మండలంలోని నాగర్లబండతండా వాసులు కేటా యించడంతో అధికారులు తాసిల్దార్‌ యేషయ్య, ఎంపీడీవో కతలప్ప, ఎస్సై వహీద్‌ అలీ బేగ్‌లు సర్పంచ్‌ రాణితో కలిసి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ప్రకృతి వనం కార్యక్రమాన్ని ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కేటాయించడానికి కొంత కాలంగా స్థానికులు నిరాకరిస్తున్నట్లు మంగళవారం మండలంలో పర్యటించిన కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాకు మండల అధికారులు తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అడ్డుపడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు కలెక్టర్‌ సూచించారు.

దీంతో మంగళవారం సాయంత్రం డీస్పీ కిరణ్‌కుమార్‌ నాగర్లబండ తండాకు చేరుకొని ప్రకృతి వనం ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని స్థానికులకు సూచించారు. దీంతో బుధవారం మండల స్థాయి అధికారులు పాన్‌గల్‌, చిన్నంబావి, వీపనగండ్ల పోలీస్‌ సిబ్బందితో కలిసి నాగర్లబండ తండాకు చేరుకొని స్థానికులను సమన్వయపరచి 23 కుంటల ప్రభుత్వ భూమిలో ప్రకృతి వనానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌, గ్రామపెద్దలు పాల్గొన్నారు.