మంగళవారం 27 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 22, 2020 , 02:54:56

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

వనపర్తి : పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎస్పీ అపూర్వరావు జిల్లా పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆమె అన్ని పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ ఆయా పోలీస్‌ స్టేషన్లకు వచ్చే కేసులు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించాలన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా నూతన సాంకేతికత పరిజ్ఞానం పెంపొందించుకుని, చట్టాలపై అవగాహన కలిగి ఉండి వాటిలో జరిగే మార్పులపై నిరంతరం అవగాహన పెంచుకుని తన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన కేసుల ఛేదనలో సైబర్‌ క్రైమ్‌ టీం సాయం తీసుకుని నేరం జరిగిన రెండు, మూడు రోజుల్లో ఆ కేసులను ఛేదించాలని అధికారులకు సూచించారు. దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెంచాలని, పెట్రోలింగ్‌, బీట్స్‌ను రాత్రి వేళ్లల్లో పకడ్బందీగా కొనసాగించాలని చెప్పారు. ఫిర్యాదులపై గ్రామాలను, క్రైం, స్పాట్స్‌ను విజిట్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, గ్రామ, కింది స్థాయిలో సమాచార సేకరణ వనరులను వృద్ధి చేసుకొని ప్రతి సమస్య ప్రతి సమాచారం పోలీస్‌ వారికి వచ్చే విధంగా సంబంధాలు కలిగి ఉండాలన్నారు. స్నేహ పూర్వక పోలీసింగ్‌ నిర్వహించాలని, గుట్కా, గ్యాబ్లింగ్‌ దాడులు మమ్మురంగా నిర్వహించి జిల్లాలో పేకాట, గుట్కా, మట్కాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సెన్‌, ఐటీ సెల్‌ సిబ్బంది గోవింద్‌, రవీందర్‌బాబు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు. 

ఎస్పీ ప్రజావాణికి 9 ఫిర్యాదులు 

 జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అపూర్వరావు సోమవారం తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా ఎస్పీ మాట్లాడి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో 6 భూ ఫిర్యాదులు, రెండు గొడవలు, ఒకటి భార్యాభర్తల ఫిర్యాదులకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.ఫిర్యాదులను ఆయా మండలాల ఎస్సైలకు పంపించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. logo