గురువారం 29 అక్టోబర్ 2020
Wanaparthy - Sep 22, 2020 , 01:17:14

‘భగీరథ’ ప్రాధాన్యం వివరించాలి

‘భగీరథ’ ప్రాధాన్యం వివరించాలి

  •  ఫిల్టర్‌ నీళ్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  •  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి: మిషన్‌ భగీరథ నీళ్ల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసగృహంలో వనపర్తి జిల్లాలో మిషన్‌ భగీరథ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ రానున్న కాలానికి అనుగుణంగా పేద, ధనిక పట్టణం, గ్రామాలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫిల్టర్‌ నీళ్లవైపు ఆసక్తి చూపుతున్నారన్నారు. నాణ్యతను పాటించకుండా ఫిల్టర్‌ నీటి యజమానులు ఇష్టానుసారంగా సరఫరా చేస్తున్నారని, సకల అనారోగ్యానికి ఫిల్టర్‌ నీళ్లే కారణమని మంత్రి వివరించారు. ప్రజలకు ఎలాంటి హాని కలుగకుండా పూర్తి స్థాయిలో శుద్ధిచేసి ఎన్నో పోషక విలువలు అందించేలా మిషన్‌ భగీరథ నీళ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, భగీరథ నీళ్లు తాగితే సగం రోగాలు దూరమవుతాయన్నారు. భగీరథ నీళ్లపై ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని, మినరల్‌, ఫిల్టర్‌ నీళ్లు డబ్బులు చెల్లించి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నామని, ప్రజలను చైతన్యం చేసి అలవాటును మాన్పించాలని మంత్రి వివరించారు. గిరిజన తండాలు, దళిత వాడలకు భగీరథ కనెక్షన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అక్కడక్కడ విసిరేసినట్లుండే ఇండ్ల్లను గుర్తించి కనెక్షన్‌లను ఇవ్వాలని, ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించాలని, డిసెంబర్‌కు వంద శాతం స్థిరీకరణ పూర్తి కావాలన్నారు. జిల్లా పరిధిలోని శ్రీరంగపురంలో పూర్తి కావచ్చిన మిషన్‌ భగీరథ స్థిరీకరణ, అదేవిధంగా అప్పాయపల్లి, పెద్దగూడెం, చిట్యాల సమీపంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు, పాన్‌గల్‌ సమీపంలో నిర్మిస్తున్న వేర్‌ హౌసింగ్‌ గోదాంల వద్ద ఉద్యోగులు, హమాలీల గృహాలు రానున్నాయని, అక్కడా భగీరథ  కనెక్షన్లు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రుల నివాసం, అధికారుల, ప్రజా ప్రతినిధుల  సముదాయంలో మినరల్‌ నీటికి బదులుగా మున్సిపాలిటీ నీళ్లే వాడాలని సిబ్బందికి మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి, సీఈ చిన్నారెడ్డి, ఎస్‌ఈ జగన్‌మోహన్‌, ఈఈలు మేఘారెడ్డి, సుధాకర్‌ సింగ్‌ పాల్గొన్నారు.


logo