గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Sep 15, 2020 , 08:26:47

ముగిసిన మొదటి విడుత ఆన్‌లైన్‌ తరగతులు

ముగిసిన మొదటి విడుత ఆన్‌లైన్‌ తరగతులు

  •  జిల్లావ్యాప్తంగా 76 నుంచి   78 శాతం హాజరు
  •  ప్రారంభంకానున్న ఆంగ్ల బోధన

వనపర్తి విద్యావిభాగం : కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ బోధనను కొనసాగించింది. ఈనెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రోజువారీగా టీశాట్‌, దూరదర్శన్‌, నిపుణ, విద్య ఛానళ్ల ద్వారా ఏ రోజుకూ ఆ రోజు తరగతుల వారీగా రోజు 30 నిమిషాల చొప్పున ఆన్‌లైన్‌ డిజిటల్‌ తరగతులను నిర్వహించారు. సోమవారంతో మొదటి షెడ్యూల్‌ ముగియడంతో మంగళవారం నుంచి రెండో విడుత తరగతులు ప్రారంభం కానున్నది. ఈ రెండో విడుతలో ఆంగ్ల మాధ్యమంలో డిజిటల్‌ బోధన ప్రారంభమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తెలిపారు. మంగళవారం నుంచి కొత్త షెడ్యూల్‌ విడుదల కానుందని డీఈవో తెలిపారు. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ హాల్స్‌, ఇతర ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకొని తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈనెల 21వ తేదీ నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు తరగతులు  నిర్వహించేలా మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను రూపొందిస్తే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీఈవో వెల్లడించారు. 

కొనసాగుతున్న డిజిటల్‌ తరగతులు

పెద్దమందడి : కరోనా నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించిన ఆన్‌లైన్‌ తరగతులు మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం ప్రాథమిక స్థాయిలో 3-5 తరగతి విద్యార్థులు 815 మందికిగానూ టీశాట్‌, దూరదర్శన్‌, యాదగిరి, స్మార్ట్‌ ఫోన్ల ద్వారా 542 మంది పాఠాలు విన్నట్లు ఎంఈవో జయశంకర్‌ తెలిపారు. అదేవిధంగా ఉన్నతస్థాయిలో 6-10 తరగతి విద్యార్థులు 2,251 మందికి గానూ 1,954 మంది విద్యార్థులు డిజిటల్‌ తరగతులు విన్నట్లు ఆయన చెప్పారు.