ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 15, 2020 , 08:06:35

మా పైస‌లు మాకియ్యండి!

మా పైస‌లు మాకియ్యండి!

  • లంచం తీసుకున్న కొందరు అధికారులు
  • ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రైతుల డిమాండ్‌ 
  • వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో లంచాధికారుల్లో గుబులు
  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న అవినీతిపరులు

కొందరు అవినీతిపరుల వల్ల రైతులు పడుతున్న ‘రెవెన్యూ’ కష్టాలను తొలగిస్తూ ప్రభుత్వం ఆ వ్యవస్థకు మంగళం పాడిన సంగతి విదితమే. అయితే లంచగొండులకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. పైసలిస్తే కానీ ఫైలు కదపని కొందరు ఇప్పటికే ఆయా పనుల నిమిత్తం డబ్బులు తీసుకోవడంతో రైతులు వారి వెంట పడుతున్నారు.. వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేయడంతో ఇక వారితో పనిలేకపోవడంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ సదరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో మింగలేక.. కక్కలేక అన్నట్లుంది అవినీతిపరుల పరిస్థితి..

- వనపర్తి, నమస్తే తెలంగాణ 

తాసిల్దార్‌ కార్యాలయం.. కొందరు అవినీతి అధికారుల వల్ల ఇది కాస్తా ‘రెవెన్యూ’ కార్యాలయంగా మారింది.. లంచం ఇవ్వందే ఫైలు కదలదు.. ఇవ్వకుండా ఉంటే ఏండ్ల తరబడి తిప్పుకుంటారు.. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు.. వారి పనులు  చేయడానికి కూడా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు.. ఎంత తీసుకున్నా వారి దాహం తీరడంలేదు.. వీటన్నింటినీ గుర్తించిన సీఎం కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్థ రద్దు చేయడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది.. భూ సమస్యలు పరిష్కరించాలని తిరిగి తిరిగి.. సమస్య సద్దుమనగక గతిలేక ఇచ్చిన లంచాన్ని తిరిగి ఇవ్వాలని వీఆర్‌వోల వెంట పడుతున్నారు.. దీంతో వారు షాక్‌కు గురవుతున్నారు.. తిన్నదంతా కక్కాల్సి వస్తుందని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. 

కొందరు లంచగొండి అధికారుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ వీఆర్‌వో వ్యవస్ధను రద్దుచేశారు. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించాలని లంచంగా ఇచ్చిన డబ్బులను తిరిగివ్వాలని అధికారుల వెంట పడుతున్నారు. ఈ ఊహించని పరిణామాలతో అవినీతిపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మా పైసలు మాకియ్యాలని రైతులు డిమాండ్‌ చేస్తుండటంతో తిన్నదంతా కక్కేందుకు  సిద్ధమవుతున్నారు. 

నూతన రెవెన్యూ చట్టం అమలు, వీఆర్‌వో వ్యవస్ధ రద్దుతో వనపర్తి జిల్లాలోని 92 మంది వీఆర్‌వోలు తమ అధికారాలను కోల్పోయారు. వీఆర్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరు అవినీతిపరులు పనులు చేసేందుకు రైతుల నుంచి రూ.లక్షల్లో లంచం తీసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలతో వారికి మింగుడుపడటం లేదు. 

డబ్బులు అడుగుతున్న రైతులు..

భూసమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లిన చాలా మంది రైతుల నుంచి అధికారులు లంచంగా తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారి చివరకు చేసేదేమీలేక దిక్కుతోచని పరిస్ధితుల్లో అధికారి డిమాండ్‌ చేసిన డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుంటారు. అడిగినంతా సొమ్మును ముందుగానే ముట్టజెప్పి.. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రాధేయపడి పనులు చేయించుకునే దుస్థితి కూడా ఉన్నది. అయితే, వీఆర్‌వో వ్యవస్థ రద్దు కావడంతో ఇక పనులన్నీ పారదర్శకంగా లంచాలు లేకుండా త్వరితగతిన పనులు జరిగిపోనున్నాయని రైతులు తెలుసుకున్నారు. దీంతో లంచంగా ఇచ్చిన డబ్బులను తిరిగివ్వాలని రైతులు వీఆర్‌వోలను డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రతి పనికీ లంచమే..

అవినీతి సొమ్ముకు అలవాటుపడిన కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు లంచం లేనిదే ఫైళ్లను ముట్టుకోరు. భూ సంబంధిత పత్రాలైన ఆర్‌వోఆర్‌, పహాణీ నకలు, పాస్‌పుస్తకాలు ఇచ్చేందుకు, రికార్డుల్లో భూ వివరాలు సరిచేసేందుకు, విరాసత్‌ చేసేందుకు.. ఇలా ప్రతి పనికీ ఒక రేటును ఫిక్స్‌ చేసి మార్కెట్‌లో భూమి విలువ ఆధారంగా లంచాలను వసూలు చేశారు. లంచం ఇవ్వని రైతులను ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. రైతులు పడుతున్న ఈ అవస్థల నుంచి కాపాడేందుకు సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు పరిచారు. ఇకపై అన్ని పనులూ పారదర్శకంగా జరుగనున్నాయి. ఒక్క రూపాయి లంచం లేకుండా రైతులు భూ సంబంధిత పనులు చేయించుకోనున్నారు.  

 తాసిల్‌ అంటేనే  భయపడేలా చేశారు..


ప్రజలకు అందుబాటులో ఉండి వారి పనులు చేసి పెట్టాల్సిన రెవెన్యూ అధికారులు తాసిల్దార్‌ కార్యాలయంలో పని అంటేనే భయపడేలా చేశారు. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతుంది.. పనులు అవుతాయి.. లేకుంటే కావు. పైరవీకారులకు ఇచ్చే గౌరవం ప్రజలకు ఇవ్వరు. డబ్బులు తీసుకొని ఒకరి భూమి వేరొకరి పేరుమీద రాసి కోర్టుల చుట్టే తిప్పుతూ వినోదం చూస్తారు. కోర్టులో సమస్య పరిష్కారం కాక ఉన్న పొలాన్ని కూడా ఖర్చులకోసం అమ్ముకోవాల్సిన దుస్థితి ఉన్నది. వీటికి చెక్‌ పెట్టేందుకు నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం హర్షించదగ్గ విషయం. ప్రభుత్వం సర్వే చేయించి భూ సమస్యలు లేకుండా చూడాలి. 

- శ్రావణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు 


తాజావార్తలు