బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Sep 11, 2020 , 07:21:59

నూత‌న చ‌ట్టం.. పేద‌ల అస్త్రం

నూత‌న చ‌ట్టం.. పేద‌ల అస్త్రం

  • ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు
  • అంతా పారదర్శకంగా అమలు
  • రైతు బాంధవుడిగా మారిన సీఎం కేసీఆర్‌

వనపర్తి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం పేదల పాలిట తిరుగులేని అస్త్రంగా మారింది. భూ సమస్యలతో, పాస్‌పుస్తకాల కోసం నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగే బాధితుల్లో సీఎం కేసీఆర్‌ ధైర్యం నింపారు. లంచావతారులుగా మారిన రెవెన్యూ ఉద్యోగుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు తీసుకొచ్చిన నూతన చట్టంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 130 ఏండ్ల తరువాత తీసుకొచ్చిన ఈ మార్పుతో భూ సమస్యలకు చెక్‌పడనున్నది. ఇక నుంచి అంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నమోదు కానుండడంతో కబ్జాదారులకు, అవినీతి ఉద్యోగులకు మింగుడుపడటం లేదు.

భూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నవారికి త్వరితగతిన పనులు జరిగిపోనున్నాయి. ఎలాంటి లంచాలు లేకుండా పాస్‌పుస్తకాలు అందనున్నాయి. భూ మార్పిడి అంశాల్లో నూతన నిబంధనలు అమలుకానుండటంతో అమ్మకం దారులకు, కొనుగోలుదారులకు ఇక్కట్లు తీరనున్నాయి. ఒక్క రోజులోనే వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లు పూర్తవుతుండటంతో మధ్యవర్తులకు డ బ్బులు ముట్టజెప్పుకొనే పరిస్థితులు మారనున్నాయి.

ప్రభుత్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, అక్రమార్కులకు, కబ్జారాయుళ్లకు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఉద్యోగులపై చర్యలు తీసుకొని బర్తరఫ్‌ చేసేలా మార్పులు తీసుకొచ్చారు. ప్రతి భూమిని సర్వే చేసి పారదర్శకంగా ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుచనున్నారు. ఆన్‌లైన్‌లో భూముల వివరాలను నమోదుచేసి ఆక్రమణలకు వీలుకాకుండా చర్యలు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన ఈ సంస్కరణకు యావత్‌ ప్రజానికం నీరాజనాలు పలుకుతున్నది.