బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Sep 10, 2020 , 04:14:18

భవిష్యత్‌ తరాలకు దిక్సూచి

భవిష్యత్‌ తరాలకు దిక్సూచి

  • రెండు తరాల జీవితం ఆయనది.. 
  • తెలంగాణ స్వేచ్ఛ కోసం తపించిన మేధావి
  • సాంఘిక, సాహిత్యంలో ఎనలేని సేవలు  
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • వనపర్తిలో సురవరం కాంస్య విగ్రహావిష్కరణ 

వనపర్తి, నమస్తే తెలంగాణ : ‘నేటి, భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా ఉండేందుకే సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.. ఆయన చరిత్రను తెలుసుకుంటే తెలంగాణ ప్రాంత రెండు తరలా ఆర్థిక, సా మాజిక, సాంఘిక చరితలు తెలుస్తాయి’.. అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సురవరం ప్రతాపరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ‘సురవరం-తెలంగాణ’, ‘సురవరం మొగ్గలు’ పుస్తకాల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1952లో వనపర్తి నియోజకవర్గ మొట్టమొదటి శాసనసభ్యులుగా సురవరం సేవలందించారని గుర్తు చేశారు. కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం రోజు విగ్రహాన్ని ఆవిష్కరించడం సం తోషంగా ఉందన్నారు. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు మొట్టమొదటి సారిగా గోలకొండ పత్రికను స్థాపించి 25 ఏండ్లపాటు పత్రికారంగంలో ఎనలేని సేవలు అందించారన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం లో ఆయన చేపట్టిన పోరాటాలే మలి దశ ఉద్యమానికి బావుటలుగా నిలిచాయన్నారు.

  కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ సురవరం జీవిత చరిత్ర ప్రముఖుల ప్రసంగం ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన జీవిత చరిత్రను పుస్తకాల్లో చదవడం ద్వారా తెలంగాణకు సంబంధించి ఎన్నో అంశాలు తెలిశాయన్నారు. అనంతరం ప్రముఖ చరిత్ర పరిశోధకులు జితేందర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణలో వాక్‌ స్వాతంత్య్రం, వ్యక్తి స్వాతంత్య్రం లేని రోజుల్లో స్వేచ్ఛాయుత వాతావరణం కోసం ఎంతో పరితపించారన్నారు. ఆయన గ్రం థాలను, రచనలను నేటి యువత అధ్యయనం చేయాలని కోరా రు. ఆయన మృతి చెందిన 70 ఏండ్ల తర్వాత సురవరం విగ్రహాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. గోలకొండ పత్రిక ద్వారా నిజాం పాలనలో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు.

1850 లో రాజారామేశ్వర్‌రావు చేసిన సంఘ సంస్కరణలు దళితులకు విద్య, కులాంతర వివాహానికి దోహదపడిన తీరును వెలుగులోకి  తెచ్చింది ఈయనే అన్నారు. డాక్టర్‌ చెన్నయ్య మాట్లాడుతూ సురవరం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో మంత్రి ప్రత్యేక చొరవను కనబర్చారని చెప్పారు. ఆచార్య ఎల్లూరు శివారెడ్డి మాట్లాడుతూ సురవరం ఎవరికీ బయపడకుండా రచనలు చేసేవాడని తెలిపారు. పులువురు సాహితీవేత్తలు సురవరం జీవిత చరిత్రను, రచనా శైలినీ, రాజకీయ సేవలపై ప్రసంగించారు. అనంతరం జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి సురవరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ వేణుగోపాల్‌, జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీధర్‌, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, రచయితలు, నాయకులు పాల్గొన్నారు.