ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Sep 08, 2020 , 01:10:59

ప్ర‌క్షాళ‌న మొద‌లైంది...

ప్ర‌క్షాళ‌న మొద‌లైంది...

  • వీఆర్‌వో వ్యవస్థ రద్దు
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్‌ సోమేశ్‌ 
  • ఉమ్మడి జిల్లాలో 646 మంది వీఆర్‌వోలు 
  • వివిధ శాఖలకు బదలాయించే అవకాశం
  • రికార్డులు స్వాధీనం.. పరిశీలించిన కలెక్టర్లు
  • రెవె‘న్యూ’ చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయం

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఈ దిశగా నూతన చట్టం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 646 మంది వీఆర్‌వోలకు శాఖల బదలాయింపు జరిగే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు వీఆర్‌వోల వద్ద ఉన్న భూముల రికార్డులను ఆయా మండలాల్లో తాసిల్దార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియను వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌లో కలెక్టర్లు  యాస్మిన్‌ బాషా, శర్మన్‌ చౌహాన్‌,  వెంకట్రావు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భూ వ్యవహారాల్లో వీఆర్‌వోలవ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతోపాటు అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

- నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/మహబూబ్‌నగర్‌/వనపర్తి/ నారాయణపేట/అయిజ

జిల్లా వీఆర్‌వోలు

మహబూబ్‌నగర్‌ 158

నారాయణపేట 120

జోగుళాంబ గద్వాల    92

నాగర్‌కర్నూల్‌ 182

వనపర్తి   94

మొత్తం   646


వనపర్తి జిల్లాలో 94మంది వీఆర్వోలు

రికార్డులు స్వాధీనం చేసుకున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

వనపర్తి : రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థకు చెల్లుబాటు చేస్తూ  ప్రభుత్వం కొత్త చట్టానికి నాంది పలికింది. దీంతో రెవెన్యూ శాఖలో పలు మార్పులకు దారి తీస్తున్నది. రెవెన్యూ పరిధిలోని అవినీతి వ్యవస్థను రూపుమాపడానికి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ పరిధిలోని ఆర్‌వోఆర్‌, పహాణి, ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డులను ఆయా మండలాల తాసిల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోల నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు స్వాధీనం చేసుకుని కలెక్టర్‌కు సమర్పించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో  96 మంది వీఆర్వోలు ఉన్నారు. అందులో వనపర్తి మండలంలో రెండు పోస్టులు ఖాళీ ఉండగా మిగిలిన 94 మంది వీఆర్వోలు విధులు నిర్వహిస్తున్నారు. 94మంది వీఆర్వోలు తమ పరిధిలోని రెవెన్యూ రికార్డులను ప్రభుత్వ ఆదేశాల మేరకు తాసిల్దార్లకు అందజేశారు. సోమవారం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ , ఆర్డీవో అమరేందర్‌, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ వనపర్తి మండల తాసిల్దార్‌ కార్యాలయంలోని వీఆర్వో కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. 

తాజావార్తలు