గురువారం 03 డిసెంబర్ 2020
Wanaparthy - Sep 06, 2020 , 06:02:31

నిరంత‌రంగా... నిర్విఘ్నంగా...

నిరంత‌రంగా... నిర్విఘ్నంగా...

 • 24గంటలూవిద్యుత్‌ వెలుగులు
 • భారీ వర్షానికి సైతం నిలువని సరఫరా 
 • తీరిన లో ఓల్టేజీ కష్టాలు
 • పెరిగిన వ్యవసాయం.. సబ్‌ స్టేషన్ల సామర్థ్యం 
 • తగ్గిన విద్యుదాఘాతాలు

        ఉమ్మడి రాష్ట్రంలో రైతులు కరెంట్‌ కోసం అరిగోస పడ్డారు.. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియక కష్టాలు అనుభవించారు.. విద్యుత్‌ సరఫరా లేక ఎండిపోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.. వానకాలం వచ్చిందంటే ఇక ఆ కష్టాలు వర్ణనాతీతం.. విద్యుత్‌ లైన్లు తెగిపడితే వాటిని సరిచేయడానికి రెండు మూడు రోజులు పట్టేది.. పస్తుతం ఆ పరిస్థితి మారింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం 24గంటల విద్యుత్‌ అందిస్తున్నారు.. రెండేండ్లుగా ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతున్నది. 

  • పాలమూరు: తెలంగాణ ప్రభుత్వ ఏర్పడినా తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.900 కోట్లతో 33కేవీ లైన్లు సరిచేయడంతో పాటు కొత్తగా 130 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేసి కావాల్సిన చోట సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రీ మాన్‌సూన్‌లో భాగంగా వానకాలం రాకముందే  విద్యుత్‌ లైన్‌లను సరిచేయడం విరిగిన, వంగిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. వాటితోపాటు చెట్ల కొమ్మలను తొలగించి ఎప్పటికప్పుడు విద్యుత్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా రూ.20కోట్లతో పలు పనులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు రూరల్‌ మండలంలో 487 కొత్త విద్యుత్‌ స్తంభాలను, డ్యామేజ్‌, వంగిన స్తంభాల స్థానాల్లో 334 స్తంభాలను ఏర్పాటు చేశారు. 227 స్టేవైర్లను, 2672 మీటర్ల లూజ్‌లైన్‌ను సరిచేశారు.
   కొత్తగా 2,942 మీట్లర్లు మూడు, ఐదు వైర్‌లను, 11చోట్ల పాడైనా స్ట్రీట్‌లైట్‌ మీటర్లను, 173 కొత్త  స్ట్రీట్‌లైట్‌ మీటర్లను ఏర్పాటు చేశారు. హన్వాడ మండలంలో 241నూతన స్తంభాలను, డ్యామేజ్‌, వంగిన స్తంభాల స్థానంలో 224 స్తంభాలను, కోయిల్‌కొండలో 470 కొత్త స్తంభాలు, 365 డ్యామేజ్‌ స్తంభాలు, దేవరకద్రలో 242 కొత్తవి, 257 డ్యామేజ్‌ స్తానాల్లో స్తంభాలను  ఏర్పాటు చేశారు. చిన్నచింతకుంట, గండీడ్‌, జడ్చర్ల, మిడ్జిల్‌, భూత్పూర్‌, అడ్డాకుల, మూసాపేట, రాజాపూర్‌, బాలానగర్‌, నవాబ్‌పేట మండలంలో మొత్తంగా 3,866 కొత్తగా, 3,155 డ్యామేజ్‌ స్తంభాలను, 1,866 డ్యామేజ్‌ స్టేవైర్లను, 11,069 మీటర్ల లూజ్‌లైన్‌ను సరిచేశారు. 

   రూ.12.48కోట్లతో సబ్‌స్టేషన్లు

   జిల్లాలో రూ.12.48కోట్లతో కొత్తగా ఆరు 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో అడ్డాకుల మండలం నిజాలాపూర్‌, నవాబ్‌పేట ఇప్పటూర్‌, చిన్నచింతకుంట అప్పంపల్లి, కోయిల్‌కొండలో చంద్రాస్‌పల్లి, జడ్చర్ల బూర్గుపల్లి, భూత్పూర్‌ వెల్కిచర్లలో సబ్‌స్టేషన్‌ నిర్మించారు. అదేవిధంగా ఇంటిగ్రేటేడ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ పథకంలో రూ.23.58కోట్లు, దీన్‌ దయాల్‌ గ్రామజ్యోతి యోజన స్కీంలో రూ.14.94కోట్లు, వ్యవసాయ బావుల కనెక్షన్ల కోసం 3,072 దరఖాస్తులకు గానూ 1,299 బావులకు రూ.9.09కోట్లు కేటాయించారు. జిల్లాలో రూ.3.05 కోట్లతో 6 సబ్‌స్టేషన్ల స్థాయిని పెంచారు. 13,620 ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.2.99కోట్లు ఖర్చు చేశారు.

   ఆరేండ్లలో 70ఏండ్ల అభివృద్ధి

   నారాయణ పేట : ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. తెలియని రోజుల నుంచి కనురెప్పపాటు కోతలు (మరమ్మతుల సమయంలో మిన హా) లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్న స్థాయికి చేరడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఆరేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో పాలమూరు జిల్లాలో ఉన్న ప్రస్తుత నారాయణపేట జిల్లాలో కేవలం 25 సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండగా ఆరేండ్లలోనే అదనంగా 21 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. మరో 11 సబ్‌స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
   తెలంగాణ ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ అమలు చేయాలని భావించిందో అప్పుడే పెద్ద ఎత్తున విద్యుత్‌ ఆధునికీకరణ పనులను చేపట్టడం జరిగింది. పవర్‌ వీక్‌ కార్యక్రమంలో జిల్లాలో ఒరిగిన 3వేల స్తంభాలను మార్చడం జరిగింది. వేలాడుతున్న లైన్ల చోట్ల అదనంగా 1,955 స్తంభాలను ఏర్పాటు చేశారు. వైర్లు లేని 6,030 వీధిలైట్లను ఏర్పాటు చేశారు. గతంలో 15 గ్రామాలకు కలిపి ఒక సబ్‌స్టేషన్‌ ఉండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 గ్రామాలకు కలిపి ఒక సబ్‌ సేషన్‌ ఏర్పాటు చేశారు. ఫలితంగా విద్యుత్‌ సరఫరాలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించడానికి వీలవుతున్నది. 

   సకాలంలో పనులు చేశాం 

   వానకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మందుగానే అన్ని పనులు పూర్తి చేశాం. విద్యుత్‌ లూజ్‌లైన్లను సరిచేయడంతోపాటు 11కేవీ, 33కేవీ లైన్‌ వెంట ప్రీ మాన్‌సూన్‌ ఇన్ఫెక్షన్‌లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించాం. నిరంతర విద్యుత్‌ కోసం నాలుగేండ్లలో రూ.900కోట్ల పనులు చేశాం. వ్యవసాయ కనెక్షన్‌ కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
   - రాంరెడ్డి, టెక్నికల్‌ డీఈ, మహబూబ్‌నగర్‌

   కోతల్లేవ్‌..

   వనపర్తి, నమస్తే తెలంగాణ: వానకాలం వచ్చిందంటే చాలు కరెంట్‌ కష్టాలు మొదలయ్యేవి. వర్షం వస్తే గ్రామాల్లో విద్యుత్‌ వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు వంటి సమస్యలు నిత్యం దర్శనమిచ్చేవి. కానీ ఈ ఏడాది పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వం విద్యుత్‌శాఖలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల విద్యుత్‌ సమస్యలకు చెక్‌పడింది. కొత్తగా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా 8సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు.
   అనంతరం విద్యుత్‌శాఖలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం నూతనంగా సబ్‌స్టేషన్లను మంజూరు చేసింది. వనపర్తి జిల్లాలో మొత్తం 52 సబ్‌స్టేషన్లు ఉండగా వీటిలో నూతనంగా 33/11కేవీ సామర్థ్యం గల 8 సబ్‌స్టేషన్లను రూ. 14.41కోట్లతో ఏర్పాటు చేశారు.  మండలాల వారీగా ఆత్మకూరు మండలం బాలాకిష్టాపురంలో రూ. 1.41కోట్లు, జూరాల రూ.1.63 కోట్లతో, ఖిల్లాఘణపూర్‌ ఉప్పర్‌పల్లి 1.62కోట్లతో, పాన్‌గల్‌ మండలం  బుసిరెడ్డిలో రూ.1.78కోట్లతో, పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో రూ.1.98కోట్లతో, వనపర్తి పట్టణంలో రూ.2.51కోట్లతో,  వీపనగండ్ల మండలం బెక్కెంలో రూ.1.2కోట్లతో,  కొత్తకోట మండలం అమ్మపల్లి ఎక్స్‌రోడ్‌లో రూ.కోటితో, కొత్తకోట పట్టణంలో రూ.1.28కోట్లతో ఏర్పాటు చేశారు. వీటితోపాటు మిగతా అన్ని మండలాల్లో 10 సబ్‌స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. 

   పల్లెప్రగతితో తీరిన సమస్యలు

   గ్రామాలను శుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌శాఖ పల్లెప్రగతి కార్యక్రమంలో పవర్‌వీక్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి గ్రామంలో 7 రోజులపాటు పవర్‌ వీక్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా  2,336 ఇర్మిడియట్‌ పోల్‌లను   ఏర్పాటు చేశారు, 1,660 ఒరిగిన పోల్స్‌ను సరిచేశారు. 1,219 సపోర్టింగ్‌ పోల్స్‌ను ఏర్పాటు చేశారు.  4,008 లూస్‌లైన్లను  సరిచేశారు. 7,733 స్టీట్‌ లైన్లు సరిచేశారు. కొత్తగా 1,132 మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. 

   తీరిన కరెంట్‌ కష్టాలు

   నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కరెంట్‌ కష్టాలు తీరాయి. ఆరేండ్ల కిందట నీటి కోసం తల్లడిల్లిన ఈ ప్రాంతంలో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు వల్ల నీటి వనరుల లభ్యత పెరిగింది. దీని ఆధారంగా సాగు పెరుగుతూ వస్తున్నది.
   రాష్ట్రం ఏర్పడకముందు కరెంట్‌ కోసం పంట వేసిన రైతులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్‌ తీసుకున్న చర్యలతో తొలుత 9గంటల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా అయ్యింది. ఆ తర్వాత 2018, జనవరి 1నుంచి 24గంటల పాటూ విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతున్నది. జిల్లాలో 85,236 బోరుబావులకు వ్యవసాయ కనెక్షన్లు అందించడం గమనార్హం. గతేడాదిలో 2,546కనెక్షన్లు ఇచ్చారు. ఈ విద్యుత్‌ పనుల కోసం ప్రభుత్వం రూ.120కోట్లను మంజూరు చేసింది. రైతులకు అడిగిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తున్నారు. దాదాపుగా 4వేల వరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో కొత్తగా 10వేల మంది వరకు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతుండటంతో లోవోల్టేజీ సమస్య లేకుండా ప్రభుత్వం రైతులందరికీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తున్నది. అదేవిధంగా ఇప్పటివరకు కొత్తగా జిల్లాలో 50 సబ్‌స్టేషన్లు నిర్మించడం జరిగింది. ఇంకా పలుచోట్ల పనులు జరుగుతున్నాయి. దీనికితోడు కొత్తగా 30కిలో మీటర్లకుపైగా కొత్త లైనింగ్‌ ఇవ్వడం జరిగింది.
   మరో పథకం దీన్‌ దయాళ్‌ యోజన ద్వారా పేదలకు అడిగిన వెంటనే ఇండ్ల కనెక్షన్లు ఇవ్వడం జరుగుతోంది. గత ఆగస్టులో భారీగా వర్షాలు కురిసినా కరెంట్‌ పోయిన దాఖలాలు లేవు. నాగర్‌కర్నూల్‌ 132కేవీ సబ్‌స్టేషన్‌ను 220కేవీ స్థాయికి పెంచడం జరిగింది. జటప్రోల్‌, పెంట్లవెల్లి, సింగోటంలాంటి పలు సబ్‌స్టేషన్ల సామర్థ్యాలు పెరిగాయి. మొత్తం మీద తెలంగాణలో కరెంట్‌ కష్టాలకు శాశ్వత చెక్‌ పడింది. ఫలితంగా రైతులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

   రైతులందరికీ ట్రాన్స్‌ఫార్మర్లు 

   రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యతతో సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్‌ సమస్యను తీర్చేందుకు సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేశారు. జిల్లాలో 24గంటల ఉచిత విద్యుత్‌ కోసం రూ.120కోట్లతో పనులు చేపట్టాం. నాగర్‌కర్నూల్‌ సబ్‌స్టేషన్‌ను 132కేవీ నుంచి 220కేవీకి పెంచుకున్నాం. 85వేల ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. కొత్తగా 50 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా 4వేలకుపైగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం.  
   - శ్యాంసుందర్‌రెడ్డి, డీఈ, నాగర్‌కర్నూల్‌

   విద్యుత్‌ కాంతులు

   •  పల్లె, పట్టణ ప్రగతిలో విద్యుత్‌ సమస్యలకు చెక్‌
   •  9,500 కొత్త కనెక్షన్లు 
   •  12 కొత్త సబ్‌స్టేషన్లు
   •  రూ.25.26 కోట్ల ఖర్చు  
   •  325 కిలోమీటర్ల కొత్త లైనింగ్‌ 
   అయిజ : పల్లె, పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. అభివృద్ధి పనులతోపాటు విద్యుత్‌ సమస్యలు పరిష్కారమయ్యాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వంగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలోని స్తంభాల తొలగింపు, అదనపు పోల్స్‌తో కొత్తలైన్ల ఏర్పాటుతో విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పడింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో వేసవి, వానకాలంలో పల్లెలతోపాటు పట్టణాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడేది. వేసవిలో డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్‌ సరఫరా చేయకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి ప్రజలు ఉక్కపోతకు గురయ్యేవారు. వానకాలం వచ్చిందవటే ఈదురు గాలులకు స్తంభాలు నేలకొరిగి వారం, పది రోజుల వరకు కరెంట్‌ ఎరుగని దినాలు ఉండేవి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయం, గృహాలు, ఫ్యాక్టరీలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నది. 

   రూ. 7.26 కోట్లతో మరమ్మతులు

   జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 12 మండలాలు ఉన్నాయి. వీటిలో గృహ కనెక్షన్లు లక్షా 12 వేల 690 ఉండగా, వ్యవసాయ కనెక్షన్లు 40,340 ఉన్నాయి. పల్లె, పట్టణ ప్రగతిలో రూ.7.26 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. వ్యవసాయ, గృహాలకు ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తున్నది.  ప్రతి పల్లెకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రూ. కోట్లాది రూపాయలు వెచ్చించి సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నది. అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయడం, ఎక్కడా విద్యుత్‌ సమస్య లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తుండటంతో జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వానకాలంలో సైతం విద్యుత్‌ కాంతులు వెదజల్లుతున్నాయి.

   నాణ్యమైన విద్యుత్‌కు చర్యలు

   జిల్లాలో నాణ్యమైన విద్యు త్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయం, గృహావసరాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఎక్కడైనా లోపాలు కనిపిస్తే గంటల వ్యవధిలోనే సమస్యలను పరిష్కరిస్తున్నాం. జిల్లా ప్రజలకు విద్యుత్‌ కష్టాలు లేకుండా చేయడం కోసం శక్తివంచనతో కృషి చేస్తున్నాం. ప్రజలు విద్యుత్‌ బకాయిలను సకాలంలో చెల్లించి సహకరించాలి.
   - చక్రపాణి, ఎస్‌ఈ, జోగుళాంబ గద్వాల