బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Sep 05, 2020 , 04:43:56

సురవరం పార్కును సుందరంగా తీర్చిదిద్దాలి

సురవరం పార్కును సుందరంగా తీర్చిదిద్దాలి

  • వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 
  • సురవరం విగ్రహ ఏర్పాటు, పార్కు పనుల పరిశీలన 
  • 9న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడి

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా సమీపంలో నిర్మించే సురవరం ప్రతాపరెడ్డి పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని మున్సిపల్‌ ఇంజినీర్‌ గోపాల్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సురవరం విగ్రహ ఆవిష్కరణ, పార్కు పనులను మంత్రి పర్యవేక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురవరం కాంస్య విగ్రహాన్ని వనపర్తిలో సెప్టెంబర్‌ 9న కాళోజి నారాయణ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నట్లు వివరించారు. తెలంగాణ భాషకు, తెలుగు భాషకు గొప్ప కీర్తిని గడించిన సురవరం విగ్రహం సాహితీ మిత్రులు, తెలంగాణవాదుల సూచనల మేరకు ఆవిష్కరించుకోవడం గొప్పతనంగా భావిస్తున్నామన్నారు. 

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి  చేయాలి

వనపర్తి జిల్లాలోని పీఏసీసీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన సంఘం సభ్యులు కృషి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఇటీవల పీఏసీసీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రవీందర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసిన వారిలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ చిన్నారెడ్డి, రైతులు శరత్‌కుమార్‌రెడ్డి, రవికుమార్‌, దామోదర్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, జయరాములు, మన్యం ఉన్నారు. 

సాఫీగా కొనసాగిన జేఈఈ పరీక్ష

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: ఐఐటీ, ఎన్‌ఐటీలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న జేఈఈ పరీక్ష జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్‌ నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం నాల్గో రోజు సాఫీగా కొనసాగిందని పరీక్షల కోఆర్డినేటర్‌ సుజీవన్‌కుమార్‌ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 100మంది అభ్యర్థులకుగానూ 91మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 100మందికిగానూ 92మంది హాజరయ్యారని పేర్కొన్నారు.