ఆదివారం 06 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 30, 2020 , 04:38:29

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

వనపర్తి విద్యావిభాగం : హాకీ మాంత్రికుడు, లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజా సంఘాల నా యకులు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ హాకీ క్రీడాకారుడిగా భారతదేశంలో హాకీ క్రీడలో మూడు స్వర్ణాలు తీసుకువచ్చి భారతదేశ గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిన హాకీ మాంత్రికుడు అని కొనియాడారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారుడు రాజరాంప్రకాష్‌, కవి పండితుడు గిరిరాజయ్యచారి, కవి, వ్యాఖ్యాత నాయకంటి నరసింహశర్మ, చీర్ల నాగేంద్రం, వెంకటస్వామి, ఈశ్వర్‌, నాగరాజు, కావలి బాలస్వామి, వెంకటేశ్‌, నరేందర్‌, రామకృష్ణ, న్యాయవాది ఉత్తరయ్య, గాయకురాలు మాధవి, యువరాజు ఉన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని హెచ్‌ఎం ఉమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ముందుగా హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ తనదైన ఆటతో భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకువచ్చాడని ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో పీడీ కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ 116 వ జయంతిని శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా జరుపుకొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ క్రీడా వ్యవస్థకు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమాకాంత్‌, వ్యాయామ ఉపాధ్యాయులు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.