గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Aug 19, 2020 , 03:30:45

ధిక్కార స్వరం మూగబోయింది

ధిక్కార స్వరం మూగబోయింది

కల్వకుర్తి పట్ణణానికి చెందిన ఎడ్మ కిష్టారెడ్డి సాధారణ రైతు కుటుంబంలో మార్చి 23,1947లో జన్మించారు. వార్డు సభ్యుడిగా, సర్పంచ్‌గా, ఎంపీపీగా, రెండుసార్లు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పీయూసీ వరకు చదివిన ఎడ్మ కిష్టారెడ్డి 20 ఏండ్ల వయస్సులో సంయుక్త సోషలిస్టు పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1970లో కల్వకుర్తి పంచాయతీ వార్డు సభ్యుడిగా గెలిచి స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1973లో కల్వకుర్తి గ్రామ పంచాయతీకి జరిగిన ఉప ఎన్నికల్లో సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని నిరసించి 1975 డిసెంబర్‌ 31న కిష్టారెడ్డి అరెస్టయ్యారు. 14నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపారు. 1981లో రెండోసారి కల్వకుర్తి సర్పంచ్‌గా విజయం సాధించి అభివృద్ధి పథంలో నిలిపారు. సర్పంచ్‌గా కొనసాగుతూ.. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరారు. 1986లో జరిగిన మండల పరిషత్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎంపీపీగా గెలుపొందారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీకి రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి 1994లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2004లో అసెంబ్లీకి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 

 ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం ఉదయం 10:30 గంటలకు కన్నుమూశారు. ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 50 ఏండ్లపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించారు. ఆయనకు భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు సత్యం, వేణు, ముగ్గురు కూతుళ్లు మాధవి, అరవింద, కవిత ఉన్నారు. ఆయన కుమారుడు ఎడ్మ సత్యం ప్రసుత్తం కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌గా(టీఆర్‌ఎస్‌) ఉన్నారు.

కరెంట్‌ కిష్టన్నగా చెరగని ముద్ర

టీడీపీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు మూడు గంటల కరెంట్‌తో రైతులు పడరాని పాట్లు పడేవారు.. కరెంట్‌ లేక పంటలు ఎండిపోతుండటంతో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలనే డిమాండ్‌తో 2004లో ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి కరెంట్‌ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. 9రోజుల పాటు దీక్ష కొనసాగించారు. ప్రతిపక్ష నేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కిష్టారెడ్డి చేత దీక్ష విరమింపజేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి సీఎం వైఎస్సార్‌ వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. దీంతో కిష్టారెడ్డి కరెంట్‌ కిష్టన్నగా రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

వైఎస్సార్‌తో సాన్నిహిత సంబంధం

దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో ఎడ్మ కిష్టారెడ్డికి సాన్నిహిత సంబంధం ఉండేది. రాజశేఖరరెడ్డి కిష్టారెడ్డిని క్రిష్ణారెడ్డి అని ఆప్యాయంగా సంబోధించే వారు. వైఎస్సార్‌ మరణాంతరం కిష్టారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేకపోయా రు. వైఎస్సార్‌ సీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.

ఉద్యమాలే ఊపిరిగా..

కిష్టారెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఆయనకు ఉద్యమాలే ఊపిరి. ప్రజల మేలు కోసం ఎంత దూరమైన వెళ్లేవారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కార్యక్రమం చేస్తున్నప్పుడు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటునకు ఉద్యమాన్ని నడిపారు. దీక్ష శిబిరానికి నేతృత్వం వహించారు. డివిజన్‌ సాధించే వరకు పట్టు వీడలేదు. కల్వకుర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలని, పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన జేఏసీకి ఎడ్మ కిష్టారెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఓ వైపు మృత్యువు వెంటాడుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా కేఎల్‌ఐ పెండింగ్‌ పనుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేఎల్‌ఐ పెండింగ్‌ పనులకు రూ.150 కోట్లు మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కిష్టారెడ్డి సరళమైన భాషలో అనర్గళంగా ప్రసంగిస్తారు. మంచి వక్త.. ఆయన ప్రసంగాలే ప్రజలకు ఆయనను చేరువ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి గడపకు తెలిసిన నాయకుడు ఎడ్మ కిష్టారెడ్డి. ఆప్యాయంగా మాట్లాడేవారని నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.