బుధవారం 28 అక్టోబర్ 2020
Wanaparthy - Aug 18, 2020 , 03:13:54

తగ్గుతున్న గోదావరి

తగ్గుతున్న గోదావరి

ఏటూరునాగారం : ఉగ్రరూపం దాల్చిన గోదావరి, జంపన్నవాగుల ప్రవాహం సోమవారం తెల్ల వారు  జాము నుంచి తగ్గుముఖం పట్టింది. రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద ఉదయం ఐదు గంటలకు 10.665 మీటర్లకు చేరుకున్న గోదావరి అక్కడ నుంచి నిలకడగా ఉంది. తర్వాత నుంచి తగ్గుతూ వచ్చింది. సాయంత్రం ఐదు గంటలకు వరకు 9.680 మీటర్లకు వచ్చింది. మూడో ప్రమాద సూచిక స్థాయికి దాటి గోదావరి వస్తుందని ఆందోళన చెందిన ప్రజలకు ఊరట లభించింది. కాగా అనేక చోట్ల రోడ్లు గండ్లు పడగా, పలు చోట్ల దెబ్బతిన్నాయి. మిర్చి నార్లు నీట మునిగి రైతులకు నష్టం వాటిల్లింది. గోదావరి కరకట్ట తూముల నుంచి ఇవతలికి వచ్చిన వరదతో వందలాది ఎకరాలు మునిగిపోయాయి. పలు ఇండ్లల్లోకి వరద చేరింది. చెల్పాక రూటులోని అల్లంవారి ఘనపూర్‌ వద్ద రోడ్డు తెగింది.మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సోమవారం సాయంత్రం సామాజిక వైద్యశాల సూపరింటెండెంట్‌ సురేశ్‌ సందర్శించారు. బాధితులతో మాట్లాడారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  

రామన్నగూడెం పుష్కరఘాట్‌కు నో ఎంట్రీ

గోదావరి ప్రవాహాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి రామన్నగూడెం పుష్కరఘాట్‌కు వెళ్తున్న వారికి సోమవారం నుంచి ప్రవేశాన్ని నిలిపివేశారు. దీంతో వీక్షించేందుకు వస్తున్న వారంతా వెనుదిరిగి పోతున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఆదేశా ల మేరకు ఇక్కడ బారి కేడ్లు ఏర్పాటు చేసినట్లు డీసీవో విజయభాస్కర్‌ పేర్కొన్నారు. ఇక్కడ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. 

కరకట్టను పరిశీలించిన అధికారులు 

ఏటూరునాగారం, రామన్నగూడెం గ్రామాలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు నిర్మించిన కరకట్టను నీటి పారుదలశాఖ సీఈ రమేశ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ దేవేందర్‌ రెడ్డి, ఈఈ జగదీశ్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఒక చోట కరకట్ట దెబ్బ ఉర్లి పోతుండగా అక్కడ కట్ట పటిష్టత కోసం వెయ్యి ఇసుక బస్తాలు అడ్డుగా వేసి చర్యలు తీసుకున్నట్లు ఈఈ జగదీశ్‌ తెలిపారు. కరకట్ట పరిసరాలతో పాటు కట్టపై ఉన్న గేట్ల పనితీరును పరిశీలించారు. కాగా, లీకేజీ వరద ఎక్కువగా గ్రామంలోకి వస్తుందని రామన్నగూడెం ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుపోయారు.  


logo