శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Aug 15, 2020 , 07:12:43

మూఢ నమ్మకమే ప్రాణాలు తీసింది

మూఢ నమ్మకమే ప్రాణాలు తీసింది

  • l అనుమానాస్పదస్థితిలో నలుగురు మృతి
  • l గుప్తనిధుల కోసం ఇంటి ఆవరణలో తవ్వకాలు
  • l విషప్రయోగం జరిగినట్లు ప్రాథమిక అంచనా
  • l మృతులంతా ఒకే కుటుంబం
  • l వనపర్తి జిల్లా నాగపూర్‌లో ఘటన
  • l పరిశీలించిన ఎస్పీ అపూర్వరావు

గుప్తనిధులు ఉన్నాయన్న మూఢనమ్మకమే వారి ప్రాణాలమీదికి తెచ్చింది. గురువారం రాత్రి తవ్వకాలు చేపట్టిన వారంతా శుక్రవారం తెల్లారేసరికి శవాలుగా మారారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడం కలకలంరేపింది. ఇంటి వెనుకభాగంలో తవ్వకాలు చేపట్టడం, నిమ్మకాయలు లాంటి వివిధ వస్తువులు ఘటనా స్థలంలో లభించడంతో నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తున్నది. వారి మీద విషప్రయోగం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. విషప్రయోగం జరిగిందా..?ఎంతమంది అక్కడ తవ్వకాలు జరిపారు..?ఇందులో ఎవరెవరి హస్తం ఉంది..? అనే పూర్తి వివరాలు తెలియాల్సిఉన్నది.

- వనపర్తి,నమస్తే తెలంగాణ

వనపర్తి, నమస్తే తెలంగాణ: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపింది. రేవల్లి మండలం నాగపూర్‌లో తెల్లవారు జామున హజీరాబీ ఇంట్లో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..నాగపూర్‌ గ్రామానికి చెందని ఆర్‌ఎంపీ డాక్టర్‌ రహీం, హాజీరాబీకి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె ఆష్మాబేగానికి భర్త ఖాజా, కూతురు ఆశ్రీన్‌ ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వీరన్నపేటకు చెందిన ఖాజా కొంతకాలంగా నాగర్‌కర్నూల్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. హాజీరాబీ కొన్నేండ్లుగా ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని తరచూ కుటుంబసభ్యులతో చర్చిస్తుండేది. ఈనేపథ్యంలో 2014 ఆగస్టు 12న కూడా ఇంటి ఆవరణలో వేపచెట్టు దగ్గర తవ్వకాలు జరుపగా ఎలాంటి నిధులు లభించలేదు. తాజాగా ఖాజా తన భార్య పిల్లలతో కలిసి నాగపూర్‌ గ్రామానికి చేరుకొని గురువారం రాత్రి హజీరాబీ ఇంట్లో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడిఉంది. ఈమేరకు గ్రామస్తులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నాగపూర్‌ గ్రామానికి చేరుకున్న ఎస్పీ అపూర్వరావు మృతదేహాలను పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ మృతుల్లో హాజీరాం బీ(60),కూతురు ఆష్మాబేగం(35), అల్లుడు ఖాజా (42), మనవరాలు ఆశ్రీన్‌ (7) ఉన్నట్టుగా తెలిపారు. ఇంటి ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. విచారణ చేపట్టి కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. ‘మా ఇంట్లో గుప్తనిధులు, దెయ్యాలు ఉన్నాయని, ఈకారణం చేతనే మా తండ్రి రహీం చనిపోయారని, నిధులను బయటకు తీయాలని మాఅమ్మ తరచూ చెబుతూ ఉండేది. ఈ విషయం పట్ల మా రెండో బావ ఖాజా ఎక్కువగా ఆసక్తి చూపుతుండే వాడు. గతంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా 2014ఆగస్టులో ఇంటి ఆవరణలో తవ్వకాలు జరిపారు. ఎలాంటి నిధులు బయటపడలేదు. ఈనెల 11న మా కుమారుడు, చనిపోయిన చిన్నారి ఆశ్రీన్‌ ఇద్దరి పుట్టిన రోజు ఉండటంతో నాగర్‌కర్నూల్‌లో బర్త్‌డే నిర్వహించాం. అక్కడి నుంచి నేరుగా మా బావ, అక్క ఆశ్రీన్‌తో కలిసి నాగపూర్‌ చేరుకున్నారు. ఇంతలోని ఇలా జరిగింది. మా కుటుంబ సభ్యులను ఎవరో చంపినట్లు అనుమానాలున్నాయి’ అని హాజీరాబీ కుమారుడు కరీంపాషా తెలిపారు. కాగా హజీరాబీ ముగ్గురు కూతుళ్లు నాగర్‌కర్నూల్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు ఆష్మాబేగం కుటుంబం ఈ ఘటనలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఒక్కో గదిలో ఒక్కో మృతదేహం

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మృతుడు ఖాజా మృతదేహం ఇంటి వెనకభాగంలో తవ్వకాలు జరిపిన ప్రదేశంలో పడి ఉంది. ఇతని పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయ, గులాబీ పూలు, ఒక కత్తి పడి ఉన్నాయి. పడకగదిలో కూతురు ఆష్మాబేగం ఉండగా ఈమె మృతదేహం పక్కన అత్తర్‌, లోబాన్‌ ఊదు, కర్పూరాలు వంటి సామగ్రి ఉన్నాయి. వంట గదిలో హజీరాబీ మృతదేహం కూర్చొని బోర్లపడినట్టుగా ఉంది. ఇంటి ముందరి గదిలో మనవరాలు ఆశ్రీన్‌ మృతదేహం పడి ఉంది. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు మనవరాలు ఆశ్రీన్‌ శరీరంపై గాయాలను గుర్తించారు. అన్ని మృతదేహాల నోటిలోంచి నురుగురావడంతో విషప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.