మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 01:04:53

వ్యవసాయంలో దేశానికే దిక్సూచి

వ్యవసాయంలో దేశానికే దిక్సూచి

  • l రైతు వేదికలతో చైతన్యం పెరుగుతుంది     
  • l అచ్చంపేట, అమ్రాబాద్‌కు సాగునీళ్లిస్తాం
  • l పుల్జాల-చంద్రసాగర్‌ కాలువ పూర్తి చేస్తాం   
  •  l వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • l అచ్చంపేటలో మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారానికి హాజరు
  • l    మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు వద్ద  జలపూజ

వ్యవసాయంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. గురువారం అచ్చంపేట మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారంలో ఎంపీ రాములు, విప్‌ గువ్వలతో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అచ్చంపేటకు నీళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అంతకుముందు వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే ఆలతో కలిసి జలపూజ చేశారు. 

- అచ్చంపేట రూరల్‌/మదనాపురం


 అచ్చంపేట రూరల్‌: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, ఎంపీ రాములుతో కలిసి హాజరయ్యారు. మంత్రి సమక్షంలో మార్కెట్‌ చైర్మన్‌గా సీఎం రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గోపాల్‌నాయక్‌, పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను రాజును చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అచ్చంపేట మండలంలోని పులిజాల వద్ద నిలిచిపోయిన కాల్వ పొడిగింపు, అమ్రాబాద్‌, పదర మండలాలకు సాగునీరు అంశం సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో 9 లక్షల 69 వేల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు నిల్వ ఉండడంతో ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటికీ రాష్ట్రంలో కోటి 19 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు, ఎనమిదిన్నర లక్షల ఎకరాల్లో పండ్లు, తోటలను సాగు చేసినట్లు పంటల నమోదుతో వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో రైతులెవ్వరు పెట్టుబడి కోసం చేతులు చాచి అడగొద్దని విజ్ఞప్తి చేశారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రాంతాల్లో ఈ ఏడాది పత్తి ఎక్కువగా సాగు చేశారని పత్తి పంట దిగుబడికి సరిపడా కొనుగోలు, కేంద్రాలు (జిన్నింగ్‌ మిల్లుల) ఏర్పాటు పై ప్రభుత్వం ప్పటి నుండే కసరత్తులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌, అచ్చంపేట ప్రాంతాల్లో మామిడి దిగుబడి ఎక్కువగా ఉంటుందని మామిడి ఆధారిత పంటల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. విప్‌ గువ్వల మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులు, సాగునీరు వల్ల లక్షలాది మంది సొంత గ్రామాలకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ అచ్చంపేట ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య జ్ఞాపకాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్‌, ఎంపీపీ శాంతాలోక్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీలు మంత్రియానాయక్‌, రాంబాబునాయక్‌, భరత్‌ప్రసాద్‌, ఉమామహేశ్వర దేవస్థాన చైర్మన్‌ సుధాకర్‌, ఏడీ బాలమణి, నాయకులు రాజేందర్‌, జగన్‌, జితేందర్‌రెడ్డి ఉన్నారు.

రైతుల కండ్లల్లో సంతోషం చూస్తున్నాం

సీఎం ధైర్యంతోనే ఆనకట్ట పనులు పూర్తిచేశాం

మదనాపురం: ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్‌ సైఫన్‌సిస్టం కలిగిన సరళాసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన అనకట్ట పనులు పూర్తిచేసి, ప్రాజెక్టులో నీరు చేరుతుండడంతో రైతుల కండ్లల్లో సంతోషం చూస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని శంకరమ్మపేట గ్రామ సమీపంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టును ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ప్రాజెక్టు దాదాపు శతాబ్ద కాలం నాటిదని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలో ఏనాడు అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టు ఏండ్ల తరబడి ఎండిపోయి ఉండేదని, ఒక్కసారిగా నీరు చేరడంతో నీటి ఉధృతికి చిన్నగా గండిపడి, గంటల వ్యవధిలోనే దాదాపు 80 మీటర్ల మేర కోతకు గురైందని గుర్తుచేశారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా తక్షణమే పనులు ప్రారంభించమని ధైర్యం ఇచ్చారని పేర్కొన్నారు. 7నెలల సమయంలోనే ప్రాజెక్టు ఆనకట్ట పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. నేడు మళ్లీ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకున్నదని ఆనందం వ్యక్తం చేశారు. మదనాపురం మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త వాజిద్‌ గత సంవత్సరం డిసెంబర్‌ 7న విద్యుదాఘాతంతో మృతిచెందాడు. అతను టీ ఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో గురువారం మండలంలోని శంకరమ్మపేట, సరళాసాగర్‌ విశ్రాంతి భవనంలో వాజిద్‌ తండ్రి జహంగీర్‌కు మంత్రి నిరజంన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా రూ.రెండు లక్షల ప్రమాదబీమా చెక్కును అం దజేశారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ అధికారులు, తాసిల్దార్‌ సంధ్య, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ సింగిల్‌ విండో చైర్మెన్‌ వంశీధర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, జెడ్పీటీసీ కృష్ణయ్య, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్‌ హనుమాన్‌ రావు, సర్పంచ్‌ పద్మమ్మ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు వాసురెడ్డి, నాగన్నయాదవ్‌, ప్రవీణ్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, యాదగిరి, అంజన్న, డబ్బకృష్ణయ్య, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.