ఆదివారం 06 డిసెంబర్ 2020
Wanaparthy - Aug 11, 2020 , 07:56:26

క‌న్న‌య్య‌తో క‌ష్టాలు తొలుగు

క‌న్న‌య్య‌తో క‌ష్టాలు తొలుగు

  • కృష్ణాష్టమికి ముస్తాబవుతున్న ఆలయాలు
  • ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్‌

గద్వాల టౌన్‌/వనపర్తి టౌన్‌ : ధర్మానికి హాని కలిగినప్పుడు, చెడు చేతిలో మంచి బాధపడుతున్నప్పుడు దుష్టులను శిక్షించేందుకు భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ధర్మాన్ని రక్షించి జగతిని ఉద్ధరించేందుకు కృష్ణుడు జన్మించాడు. శ్రావణ మాసం కృష్ణపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రంతో కూడిన అర్ధరాత్రి సమయాన మధురా నగరంలోని కఠిన కారాగారంలో దేవకి, వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. గోపాలుడిగా ఎదిగాడు. సమస్త లోకాన్ని పాలించేవాడయ్యాడు. ముక్తి కావ్యానికి మూలపురుషుడయ్యాడు. అష్టమిన రోహిణీ నక్షత్రంలో జన్మించడంతో ఆ రోజున కృష్ణాష్టమిని జరుపుకొంటున్నారు. కృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, సాంతహాతం, జన్మాష్టమిగా పిలుచుకుంటారు. 

అల్లరి కన్నయ్య..

శ్రీకృష్ణుడు అల్లరి కన్నయ్యగా పేరుగాంచాడు. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను సమస్త లోకం ఘనంగా జరుపుకొంటున్నది ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేస్తారు. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా చిన్ని, చిన్ని పాదాలను బియ్యం పిండితో వేస్తారు. ద్వారాలకు మామిడాకులు, వివిధ పూలతో తోరణాలు కడుతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రపరిచి చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. విగ్రహాన్ని, పూజ మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూప దీపాలతో పూజిస్తారు. కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పాలు, పెరుగు, వెన్నలను నైవేద్యాలుగా పెడతారు. వీధివీధిన ఉట్టి సంబరాలు అంబురాన్నంటుతాయి. తమ చిన్నారులకు శ్రీకృష్ణుడి వేషధారణ వేయించి తల్లులు మురిసిపోతారు. ఎక్కడ చూసిన మనకు ఈ దృశ్యాలే కనిపిస్తాయి.

నైవేద్యాలు..

పాయసం, వడపప్పు, చక్కెర పొంగలి వంటి పాయసాల ప్రసాదాలు, సొంటి, బెల్లంతో చేసిన పానకం, వెన్న, మీగడ, పాలు నైవేద్యంగా పెడతారు. అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు. అష్టమి రోజున ఉపవాసం ఉండి నవమి రోజున గుడిలో పారాయణతో ముగిస్తారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. 

భక్తి శ్రద్ధలతో ఉయ్యాల ఉత్సవం..

శ్రీకృష్ణాష్టమి వేడుకలను పగలంతా ఘనంగా నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ ఉయ్యాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ముందుగా శ్రీ కృ ష్ణుడిని తులసీ దళాలతో పూజిస్తారు. హరిదాసుల సంకీర్తనలు ఆలపిస్తారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన ఊయలలో శ్రీ కృష్ణుడి ప్రతిమను ఉంచి జోల పాటలు పాడుతూ ఉయ్యాల ఉత్సవాన్ని జరుపుకొంటారు.

ముస్తాబవుతున్న ఆలయాలు..

శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాం డురంగస్వామి, శ్రీకృష్ణమందిరం, సంతానవేణుగోపాలస్వామి, కోటలోని ఆలయం, మంత్రాలయ గురురాఘవేంద్రస్వామి మఠం, మల్దకల్‌ మండలంలోని సద్దలోనిపల్లి, గద్వాల మండలం రేపల్లె, ధరూర్‌ మండలకేంద్రంలోని పార్థసారథి ఆలయం, బీచుపల్లి పుణ్య క్షేత్రంలో వేడుకలు నిర్వహించనున్నా రు. వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సం ఘం భవనం నుంచి పాత కోట వరకు ట్రాక్టర్‌లో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని ఊరేగిస్తారు. పిల్లలు గోపికలు, గోపాల వేషధారణలతో భజనలు, కోలాటాలతో ర్యాలీ కొనసాగనున్నది. 

ఉత్సవాలపై కరోనా ప్రభావం..

కరోనా నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో లేకుండానే ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లో పూజారు ల సమక్షంలోనే ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి దర్శనానికి మాత్రం నిర్ణీత సంఖ్యలో అ నుమతిస్తున్నట్లు అర్చకులు వెల్లడించారు. ర్యాలీలకు అనుమతి లేకపోవడంతోపాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ పరిమి త సంఖ్యలో లోబడి వేడుకలు జరుపుకోనున్నారు.